Telugu students | విధాత : అమెరికా యూనివర్సిటీ కాలేజీలలో అడ్మిషన్ సంపాదించి అమెరికా వచ్చిన తెలుగు విద్యార్డులలో 21 మందికి నిన్నటి రోజున అమెరికాలోని చికాగో, అట్లాంటా , శాన్ ఫ్రాన్సిస్కో నగరాల ఎయిర్ పోర్టులలో అనుమతి నిరాకరించి వెనకకు పంపేశారు అన్న విషయం తెలుగు విద్యార్థి లోకానికి తీవ్ర నిరాశలో కలిగించింది. అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఆ పైన వీసా వచ్చింది అన్న ఉత్సాహంతో ‘ అమెరికా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లలో స్వాగతం చెపుతారు ‘ అనుకొంటూ వచ్చిన విద్యార్థులకు ఇది ఒక షాకింగ్ పరిణామమే.
అమెరికా దేశపు ఇమ్మిగ్రేషన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వీసా వున్న వారిని కూడా ఎందుకు వచ్చారు? ఎన్నాళ్ళు ఉంటారు? ఎక్కడ ఉంటారు? లాంటి అనేక ప్రశ్నలు వేసి , సంతృప్తికరమైన సమాధానాలు వస్తేనే వారిని అమెరికాలోకి అడుగు పెట్టడానికి అనుమతి ఇస్తారు.
వెనక్కి పంపిన విద్యార్థుల విషయంలో కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలు అర్థం కాక పోవడం, లేదా వాటి జవాబులు ఇవ్వడానికి సరి అయిన ప్రిపరేషన్ లేక పోవడం, తడబడుతూ సమాధానాలు చెప్పడం వలన ఇమ్మిగ్రేషన్ కౌంటర్ నుంచి వెనక్కు పంపారు. వారి మెయిల్స్ తనిఖీలు చేసి, ఫోన్లు, ల్యాప్ టాప్‌లు లాక్కొని, ఇరుకు గదుల్లో నిర్భంధించి తల్లిదండ్రులతో మాట్లాడనివ్వకుండా వెనక్కి పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది.
సరైన పత్రాలు లేవన్న కారణం కంటే ఇతరాత్రా కారణాలతో వారిని వెనక్కి పంపడంతో లక్షలు ఖర్చు పెట్టి ఉన్నత చదువులకు తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఒకసారి ఆ దేశం నుంచి అధికారులు తిప్పి పంపితే తర్వాతా ఐదేళ్ల పాటు అమెరికా వెళ్లడానికి అవకాశముండదు. ఈ నేపధ్యంలో ఆ విద్యార్థుల భవితవ్యంపై అయోమయంలో పడిందని వారితో పాటు తల్లిదండ్రులు అమెరికా అధికారుల తీరును తప్పుబడుతున్నారు.