Vimanam Movie Review | ఈ ‘విమానం’ మరో ‘బలగం’ అయ్యేదే కానీ..

Vimanam Movie Review మూవీ పేరు: ‘విమానం’ విడుదల తేదీ: 09 జూన్, 2023 నటీనటులు: సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ తదితరులు సంగీతం: చరణ్ అర్జున్ కెమెరా: వివేక్ కాలేపు ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ నిర్మాణం: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల విధాత: ఇటీవల ‘బలగం’ సినిమా ఎటువంటి ప్రచారం లేకుండా వచ్చి.. భారీ […]

  • Publish Date - June 9, 2023 / 01:22 PM IST

Vimanam Movie Review

మూవీ పేరు: ‘విమానం’
విడుదల తేదీ: 09 జూన్, 2023
నటీనటులు: సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ తదితరులు
సంగీతం: చరణ్ అర్జున్
కెమెరా: వివేక్ కాలేపు
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణం: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల

విధాత: ఇటీవల ‘బలగం’ సినిమా ఎటువంటి ప్రచారం లేకుండా వచ్చి.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎమోషనల్‌గా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ అందులో ఉండటంతో.. ప్రచారంతో పని లేకుండా ఆ సినిమా ప్రజలలోకి వెళ్లి పోయింది. అవార్డులు, రివార్డులతో ఆ సినిమాకి కనక వర్షం కురిసింది.

మళ్లీ అలాంటి ఫీలింగ్‌ని టీజర్, ట్రైలర్, పాటలతో ఇచ్చిన చిత్రం ‘విమానం’. ప్రచార చిత్రాలతోనే ఆకర్షించిన ఈ సినిమాలో.. టాలెంటెడ్ యాక్టర్ సముద్ర ఖని వికలాంగుడిగా నటించడం, ఓ పిల్లాడు విమానం ఎక్కాలని పదే పదే తండ్రిని అడుగుతుండటం, యాంకర్ కమ్ నటి అనసూయ ఇందులో వేశ్య పాత్ర చేయడం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం వంటి వన్నీ ఈ సినిమాని వార్తలలో ఉంచాయి.

తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగభరిత కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా.. మేకర్స్ కూడా ఈ సినిమా గురించి చెబుతూ వచ్చారు. మరి ‘బలగం’ తరహాలో బలమైన కంటెంట్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఆ స్థాయి విజయాన్ని అందుకుందో.. లేదో మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

వికలాంగుడైన వీరయ్య (సముద్ర ఖని) ఓ బస్తీలో ఉంటూ.. అక్కడ ఆటో స్టాండ్ దగ్గర సులభ్ కాంప్లెక్స్ నడుపుతుంటాడు. అదే అతని జీవనాధారం. తనకి ఒక్కగానొక్క కొడుకు పేరు రాజు (మాస్టర్ ధ్రువన్). రాజు పుట్టగానే తల్లి చనిపోతుంది. రాజును చూసుకుంటూ వీరయ్య సంతోషంగా జీవిస్తుంటాడు. రాజుకు విమానం అంటే పిచ్చి. ఎప్పటికైనా విమానం ఎక్కాలని, పెద్దయ్యాక ఫైలట్ కావాలని కలలు కంటుంటాడు. కొడుకు కోరిక తీర్చడానికి.. అందులోనూ నెల రోజులలోపే అతనిని విమానం ఎక్కించాలని వీరయ్య అందుకు ఏర్పాటు చేస్తుంటాడు.

ఎందుకు రాజును నెల రోజుల లోపే విమానం ఎక్కించాలి? తన జీవనాధారం అయిన సులభ్ కాంప్లెక్స్‌ని కూల్చేయడంతో.. అతను కొడుకు కోరికను ఎలా తీర్చాడు? మధ్యలో వీరయ్య ఎందుకు జైలుకు వెళ్లాడు? ఈ వీరయ్య కథలో వేశ్య సుమతి, ఆమెను ఆరాధించే కోటి (రాహుల్ రామకృష్ణ), డేనియల్ (ధన్‌రాజ్), ఫొటో గ్రాఫర్ రాజేంద్రన్ ఎలా భాగమయ్యారు? అనేది తెలియాలంటే ఎమోషనల్‌గా సాగిన ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు, రచయిత, నటుడు అయిన సముద్ర ఖని ఈ సినిమాలో చేసిన పాత్రకు ప్రతి ఒక్కరి నుంచి అభినందనలు అందుకుంటాడు. నిజంగా ఆయనని టాలెంటెడ్ యాక్టర్ అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే మరోసారి తెలుస్తుంది. కొడుకు కోరికను తీర్చే క్రమంలో పండించిన భావోద్వేగాలు, సంఘర్షణ.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆయన కొడుకుగా చేసిన మాస్టర్ ధ్రువన్ అవార్డ్ విన్నింగ్ నటనను కనబరిచాడు. ముఖ్యంగా అతని ముద్దు ముద్దు అమాయకపు మాటలు.. చూస్తున్న వారందరికీ ముచ్చటగా అనిపిస్తున్నాయి. అతనితో పాటు డేనియల్ కుమారుడిగా చేసిన మరో చిన్నారి కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు.

ఇక సుమతి పాత్రలో అనసూయ బాగానే మెప్పించింది కానీ.. ఆమె డైలాగ్ డెలివరీ కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ ఎయిర్ హోస్టస్‌గా హుందాగా కనిపించింది. ఇంకా రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ వంటి వారంతా తమకు దక్కిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్ ఈ సినిమాలో బాగా పండింది. దాని ముందు మిగతావన్నీ తేలిపోయాయనే చెప్పుకోవాలి.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకి చరణ్ అర్జున్ అందించిన సంగీతం, నిర్మాణ విలువలు హైలెట్‌‌గా ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ అర్జున్ ఇప్పటి వరకు కొన్ని యూట్యూబ్‌లో వచ్చే పాటలకే పరిమితం అవడంతో.. అతని టాలెంట్ ఇండస్ట్రీకి తెలియలేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. నిజంగా ఇచ్చి పడేసిండు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా కొన్ని సీన్లకు కత్తెర పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తున్నాయి.

సెకండాప్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు శివ ప్రసాద్ యానాల రాసుకున్న కథలో విషయం ఉంది కానీ.. ఆ కథని నడిపే స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఇంకాస్త ఉత్కంఠ భరితంగా ఈ స్టోరీని చెప్పే అవకాశం ఉన్నా కూడా.. దర్శకుడు ఆ ఆలోచన చేయలేదు. అందుకే మరో ‘బలగం’ అవ్వాల్సిన ఈ సినిమా ఆ విషయంలో బలహీన పడిపోయింది.

విశ్లేషణ:

‘విమానం’ సినిమాలో ఏడిపించే సన్నివేశాలకు కొదవలేదు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య సాగే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. థియేటర్ నుంచి బయటికి వచ్చిన వెంటనే తండ్రి ఉన్నవాళ్లు.. వెంటనే కాల్ చేసి తన తండ్రితో మాట్లాడాలని అనుకుంటారు. ఆ మూడ్‌ని ఈ సినిమా రప్పిస్తుంది.

‘బలగం’ సినిమా కూడా ఇటువంటి తండ్రి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కి.. చివరికి వచ్చే సరికి.. అప్పటి వరకు దాచుకున్న దు:ఖాన్ని తన్నుకువచ్చేలా చేస్తుంది. ఇందులో కూడా క్లైమాక్స్ దాదాపు అటువంటి పరిస్థితులనే కల్పిస్తుంది. క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రాణం.

అయితే పదే పదే వీరయ్య, అతని కొడుకు చుట్టూనే కథని తిప్పడం మధ్యలో కాస్త బోరింగ్ అనిపిస్తుంది. తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌తో పాటు కాస్త మసాలా కంటెంట్ దట్టించాలని అనసూయ ఎపిసోడ్‌ని జత చేసినట్లుగా అనిపిస్తుంది కానీ.. దానిని పూర్తి స్థాయిలో వినియోగించు కోలేదనే చెప్పాలి. ఫస్టాఫ్ అంతా వీరయ్య చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిచయం చేయడానికి వాడుకున్న దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం పూర్తి స్థాయిలో ఎమోషన్స్‌తో నింపేశాడు. ఆ ఎమోషన్స్‌కి తగ్గట్లు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది.

ముఖ్యంగా మాస్టర్ ధ్రువన్ కోణంలో ఈ సినిమా పిల్లలని సైతం బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. అతను తండ్రిని అడిగే అమాయకపు ప్రశ్నలు చూస్తున్న ప్రేక్షకులకు నవ్వును తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు.. ఇంకెప్పుడు ఈ విమానం టేకాఫ్ తీసుకుంటుది అని అనేపించేలా సాగాయి. రన్ వే పైనే ఎక్కువ సేపు ఉంచేశారేంటి? అనే భావనను కలిగిస్తాయి. ఇంటర్వెల్ సమయానికే ఈ సినిమా ఎండింగ్ ఎలా ఉండబోతుందో కూడా తెలిసిపోతుంది. అయితే క్లైమాక్స్ సన్నివేశాలను మాత్రం ఊహించని విధంగా దర్శకుడు తెరకెక్కించాడు.

సినిమా చూసి బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా ఫీలయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్లను సాదాసీదాగా వదిలేయడం, ఫస్టాఫ్ పరిచయాలకే ఎక్కవ టైమ్ తీసుకోవడం వంటి వాటితో పాటు అక్కడక్కడా స్ర్కీన్‌ప్లే గాడితప్పడం వంటివి ఈ సినిమాని ఇంకో లెవల్‌కి చేర్చలేకపోయాయి. మొత్తంగా అయితే.. ‘బలగం’ స్థాయిలో కంటెంట్‌ అయితే ఉంది కానీ.. కనెక్షన్ మాత్రం మిస్సయింది. ఇంకా చెప్పాలంటే టేకాఫ్‌కి చాలా టైమ్ తీసుకున్న ఈ విమానం.. పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు.

ట్యాగ్‌లైన్: ఈ ‘విమానం’ మరో ‘బలగం’ అయ్యేదే కానీ..
రేటింగ్: 2.75/5

Latest News