Virupaksha
మూవీ పేరు: ‘విరూపాక్ష’
విడుదల తేదీ: 21 ఏప్రిల్, 2023
నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, అజయ్, రవికృష్ణ, సోనియా సింగ్, సాయిచంద్, రాజీవ్ కనకాల, సునీల్ తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్
స్క్రీన్‌ప్లే: సుకుమార్
నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ దండు
మెగా మేనల్లుడుగా గుర్తింపు తెచ్చుకుని.. తనకంటూ ఒక స్టార్‌డమ్ సంపాదించుకునే ప్రాసెస్‌లో ఉన్న సాయిధరమ్ తేజ్‌కు అనూహ్యంగా యాక్సిడెంట్ కావడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. చావు అంచు వరకు వెళ్లి.. మృత్యుంజయుడుగా తిరిగి వచ్చిన సాయిధరమ్.. మళ్లీ ముఖానికి రంగేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా.. యాక్సిడెంట్‌తో వచ్చిన లోపాలను జయించి.. మళ్లీ తనకి మొదటి సినిమా అని భావించి.. డెబ్యూ డైరెక్టర్‌తో సినిమాని ఓకే చేశాడు. ఆ సినిమా పేరే ‘విరూపాక్ష’ (Virupaksha).
ఈ టైటిల్ ప్రకటించగానే ఈ సినిమాపై ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. అందుకు కారణం.. ఈ టైటిల్‌ని పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి మొదటగా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మేనల్లుడు ఈ టైటిల్‌తో సినిమా చేస్తుండటంతో.. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత సినిమాకు సంబంధించి రివీలైన విషయాలు, పోస్టర్స్, టీజర్, ట్రైలర్.. ఇలా వేటికవే సినిమాపై పాజిటివ్ బజ్‌కు కారణం అవుతూ వచ్చాయి.
‘బలగం’ సినిమాలా.. విడుదలకు ముందే పాజిటివ్ స్పందనతో వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది. థియేటర్లలో నిలబడే సత్తా ఈ సినిమాకు ఉందా? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయాన్ని మన రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రుద్రవనం అనే ఊరిలో బంధువులు ఉన్నారని తెలిసి.. వారిని కలుసుకునేందుకు తన తల్లితో సహా సూర్య (సాయిధరమ్ తేజ్) ఆ ఊరు వస్తాడు. అయితే అదే సమయంలో ఆ ఊరిలో వరుసగా విచిత్రంగా మరణాలు సంభవిస్తుంటాయి. ఆ ఊరి పూజారి (సాయిచంద్) ఓ గ్రంథం చూసి.. అందులో ఏది రాసి ఉంటే అది చేస్తూ ఉంటారు. అలా ఆ మరణాలను ఆపేందుకు.. అందులో చూసి అష్టదిగ్బంధనం చేయాలని ఊరంతా తీర్మానించుకుంటారు. అంటే వేరే ఊరి వాళ్లు ఆ ఊరు రావడం గానీ, ఆ ఊరి వాళ్లు బయటికి వెళ్లడం వంటిది జరగకుండా దిగ్బంధిస్తారు. అయినా కూడా మరణాలు ఆగవు.
ఈ క్రమంలో బంధువుల ఇంటికి వచ్చిన సూర్య.. అక్కడ నందిని (సంయుక్తా మీనన్)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ దిగ్బంధనం ప్రకారం వేరే ఊరి వాళ్లు ఉండకూడదు కాబట్టి.. సూర్య వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే ఆ ఊరిలో ఉన్న తన ప్రియురాలిని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్న సూర్య.. ఆ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి పూనుకుంటాడు. మళ్లీ రుద్రవనంలోకి అడుగుపెట్టిన సూర్య.. ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు? అసలు ఆ వరుస మరణాలకి కారణమైన మిస్టరీ ఏంటి? అనేది తెలియాలంటే.. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో తెరకెక్కిన ఈ మిస్టీక్ థ్రిల్లర్‌ని థియేటర్‌లో చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటుల విషయానికి వస్తే.. సాయిధరమ్ తేజ్ గొప్పగా చేశాడని ఏం చెప్పలేం కానీ.. ఆయన పాత్రకు మాత్రం పూర్తిగా న్యాయం చేశాడు. ఇంతకు ముందు సినిమాలలో మాదిరిగా అతి వినయం ప్రదర్శించకుండా.. కథకి, పాత్రకి ఎంత కావాలో అంతే అభినయాన్ని సాయిధరమ్ తేజ్ ప్రదర్శించాడు. అతనికి ఇది మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. చాలా న్యాచురల్‌గా ఆయన నటన సాగింది. సన్నివేశాలకు అనుగుణంగా ఆయన మారే తీరు.. ఆకట్టుకుంటుంది. సాయిధరమ్ కెరీర్‌లో ది బెస్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమా నిలబడిపోతుంది.
ఇక సినిమాలో సాయిధరమ్ కంటే కూడా సంయుక్తా మీనన్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాలన్నింటిలో కెల్లా.. ఈ చిత్రంలో ఆమెకు చాలా మంచి పాత్ర పడిందని చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా.. గ్లామర్‌తో పడేసిన ఈ భామ.. సెకండాఫ్, ముఖ్యంగా సినిమా చివరి అరగంటలో అందరికీ థ్రిల్ ఇస్తుంది. అంత చక్కగా పాత్రలో సంయుక్తా ఒదిగిపోయింది. విశేషం ఏమిటంటే.. సినిమాలో కనిపించే ప్రతి పాత్రపై డౌట్ వస్తుంటుంది. అంత ఉత్కంఠభరితంగా పాత్రలను దర్శకుడు మలిచాడు.
పూజారి పాత్రలో సాయిచంద్, తక్కువ సీన్లే ఉన్నప్పటికీ సినిమాపై బలమైన ప్రభావం చూపే పాత్రలో రాజీవ్ కనకాల కనిపిస్తారు. ఇంకా అజయ్, కమల్ కామరాజు, బ్రహ్మాజీ, రవికృష్ణ, సోనియా సింగ్, శ్యామల, అభినవ్ గోమఠం.. ఇలా అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు ఇచ్చిన పాత్రలకు జీవం పోశారని చెబితే బావుంటుంది. సునీల్‌కు పెద్దగా అవకాశం దక్కలేదు.
సాంకేతిక నిపుణుల పనితీరుకు వస్తే.. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా శ్యామ్ దత్ కెమెరా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో చూస్తేనే వాటి మజా తెలుస్తుంది. శ్యామ్ దత్‌కు ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే.. రుద్రవనం అనే గ్రామాన్ని ఆయన చూపించిన తీరు, రాత్రివేళల్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలను ఆయన బంధించిన తీరుకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సృష్టించిన రుద్రవనం గ్రామం సెట్ అతని కళా నైపుణ్యానికి తార్కాణం. ఆయనకి కూడా మంచి పేరొస్తుంది.
ఈ సినిమాకి ఇవన్నీ ఒక ఎత్తయితే.. స్ర్కీన్‌ప్లే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. లెక్కల మాస్టారు సుకుమార్ స్ర్కీన్‌ప్లే ఎలా ఉంటుందో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆయన ఏదో మ్యాజిక్ చేశాడు. సినిమా మంచి మూడ్‌లో నడుస్తున్న ప్రతిసారి కొత్త పాత్రని పరిచయం చేయడం.. ఆ పాత్రపై అనుమానం కలిగేలా చేయడం స్ర్కీన్‌ప్లే గొప్పతనం. అలాగే తొలి చిత్రంతోనే ఇలాంటి థ్రిల్లర్‌ని డీల్ చేసిన దర్శకుడు అభినందనీయుడు. దర్శకుడు కార్తీక్ దండు రాసుకున్న కథ, అందులోని థ్రిల్లింగ్ అంశాలను తెరపైకి ఎక్కించిన తీరు.. ప్రేక్షకులను అలరిస్తుంది. అసలు ఏ సీన్‌లో కూడా అతను డెబ్యూ డైరెక్టర్ అని తీసేయడానికి లేకుండా.. చాలా గ్రిప్పింగ్‌గా కథని నడిపించాడు.
విశ్లేషణ:
ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్ సినిమాలను చూసి ఉన్నారు. అందులోనూ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో ఉన్న థ్రిల్లర్, హర్రర్ సినిమాలను కూడా భాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. అలాంటి సమయంలో.. డెబ్యూ డైరెక్టర్ అయినటువంటి కార్తీక్ దండు ఇటువంటి హర్రర్ అంశాలతో కూడిన థ్రిల్లర్ జోనర్‌ని సెలక్ట్ చేసుకోవడం సాహసమనే చెప్పుకోవాలి. 1980, 90లో సాగే కథగా పరిచయం చేసి.. మంత్రవిద్యలు, చేతబడి అంటూ ఒకరిద్దరిని కాదు.. ఊరు ఊరంతా భయపడేటటువంటి నేపథ్యంతో కథ సాగుతుంది.
వాస్తవానికి ఇటీవల కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది. దేశాలన్నీ భయపడిపోయాయి. ఒక ఊరి నుంచి మరో ఊరికి రాకపోకలు ఆగిపోయాయి. ప్రభుత్వాలే ఆపేశాయి. తుమ్మినా, దగ్గినా జనాలు భయపడిపోయారు. మరి దీని నుంచి కథను సిద్ధం చేశాడో.. కరోనా కంటే ముందే తను ఈ కథను సిద్ధం చేసుకున్నాడో తెలియదు కానీ.. కరోనా టైమ్‌లో ప్రజలు భయపడిన తీరుని.. ఈ సినిమాతో మరోసారి దర్శకుడు గుర్తు చేశాడు. అక్కడ వైరస్ అయితే.. తాంత్రిక, చేతబడి, ఆత్మలు వంటి వాటితో దర్శకుడు భయపెట్టాడు. అయితే సూర్య అసలు రహస్యం ఛేదించే క్రమంలో వచ్చే సీన్లన్ని ప్రేక్షకులకు బీభత్సమైన థ్రిల్‌ని ఇస్తాయి.
‘విరూపాక్ష’(Virupaksha) టైటిల్‌కి న్యాయం చేస్తాయి. కథకి తగినట్లుగా స్క్రీన్‌ప్లే కూడా సెట్ కావడంతో.. చూస్తున్న ప్రేక్షకుడికి ఉత్కంఠతని కలిగించడమే కాకుండా.. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల ప్రేమ, రెండు మూడు మరణాలతో కథని నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం చూపు తిప్పుకోలేనంతగా కట్టిపడేస్తాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని సీన్లు కాస్త సాగదీతగా అనిపించడంతో పాటు, హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ అంత గొప్పగా అనిపించదు. అలాగే ప్రతి సన్నివేశాన్ని డిటైల్డ్‌గా చెప్పాలనే ప్రయత్నం కూడా కొన్ని సన్నివేశాలలో సాగదీతకి కారణమైంది.
ఫైనల్‌గా మాత్రం టికెట్ కొనుక్కుని లోనికి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడికి మంచి థ్రిల్‌ని అయితే ఈ చిత్రం ఇస్తుంది. టీమ్ ఎఫర్ట్‌కి దక్కిన విజయంగా ‘విరూపాక్ష’కు పేరు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టేశారు. దర్శకుడు కార్తీక్ దండుకు ఈ సినిమా తర్వాత పెద్ద హీరోల నుంచి కాల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత పగడ్బందీగా ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. సినిమాలో హీరోకి ఎదురయ్యే సవాళ్ల మాదిరిగా.. దర్శకుడు కూడా తన తొలి ప్రయత్నంలో వీరోచితంగా విజయాన్ని అందుకున్నాడు. ఇందులో ఉన్న కంటెంట్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మరో ‘కార్తికేయ 2’ చిత్రంలా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు అయితే లేకపోలేదు.
ట్యాగ్‌లైన్: థియేటర్లలో ప్రేక్షకులని దిగ్బంధించే సినిమా ఇది
రేటింగ్: 3.25/5