Ravi Chandran | అరచేతిలో ప్రపంచం.. చదువుకోవడానికి అందుబాటులో పుస్తకాలు.. సకల సౌకర్యాలు కల్పించినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో యువత విజయం సాధించలేకపోతున్నారు. కానీ ఓ కూలీ మాత్రం పట్టువిడవని విక్రమార్కుడిలా తన పోరాటం సాగించి గ్రూప్-2 ప్రిలిమినరీ పాసయ్యాడు. మరి ఆ కూలీ గురించి వింటే ప్రతి ఒక్కరి హృదయాలు కదలాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని చూడలేడు. పుట్టుకతోనే అంధుడు. అయినప్పటికీ తాను నిరుపేదలకు ఏదో చేయాలన్న సంకల్పంతో.. 55 ఏండ్ల వయసులోనూ కూలీ పనులు చేసుకుంటూ.. తోటి మహిళా కూలీ సాయంతో చదువుకుని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో విజయం సాధించాడు. మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. దీంతో ఆ అంధుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
తమిళనాడు తంజావూరు జిల్లాలోని అజియావైకల్ గ్రామానికి చెందిన రవిచంద్రన్(55) పుట్టుకతోనే అంధుడు. 1990లో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. కానీ ఉద్యోగం చేయలేదు. ఇక కూలీ పనులకు వెళ్తూ కాలం వెల్లదీస్తున్నాడు. అయితే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు రవిచంద్రన్. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తూనే.. గ్రూప్-2 ప్రిలిమినరీకి ప్రిపేర్ అయ్యాడు. పుస్తకాలను తన వెంట తీసుకొని పనులకు వెళ్లేవాడు. సమయం దొరికినప్పుడల్లా.. తోటి కూలీ పద్మావతితో గట్టిగా చదివించుకొని, వినేవాడు. అలా ఎగ్జామ్ వరకు చేశాడు. ఇటీవల విడుదలైన ప్రిలిమినరీ ఫలితాల్లో రవిచంద్రన్ పాసయ్యాడు. ఇప్పుడు మెయిన్స్‌కు ప్రిపేరవుతున్నాడు.
ఈ సందర్భంగా రవి చంద్రన్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిరుపేద ప్రజలకు చాలా రకాలుగా సేవ చేస్తున్నాను. మరింత సేవ చేయాలనే తపన ఉంది. అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైందని తనకు అనిపించింది. దీంతో గ్రూప్-2 నోటిఫికేషన్ రాగానే తోటి కూలీ పద్మావతి సాయంతో చదువుకున్నాను. మే 21న గ్రూప్-ప్రిలిమినరీ పరీక్షకు అటెండ్ అయ్యాను. సహాయకుడి ద్వారా పరీక్ష విజయవంతంగా రాశాను. నవంబర్ 8న వచ్చిన ఫలితాల్లో మెయిన్స్‌కు ఎంపికైనట్లు తెలిసిందన్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దొరికినందుకు సంతోషంగా ఉందని రవిచంద్రన్ పేర్కొన్నారు.