- గృహలక్ష్మీ కింద రూ.3లక్షల సహాయం అందజేస్తానని హామీ
- చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజవర్గంలోని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. సోమవారం పోచమ్మ కుంటలో జంగా భద్రయ్య కాలనీలోని నిరుపేద కుటుంబాలకు చెందిన దాదాపు 80 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వీఫ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల కోరిక నెరవేరిందని ఆయన అన్నారు. జిఓ నంబర్ 58ప్రకారం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశామని అన్నారు. ఈ డివిజన్లో 2ఎకరాల 25గుంటల భూమిలో 1990 లో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు జంగా భద్రయ్య కాలనీ ఏర్పరచుకొని గుడిసెలు వేసుకున్నారని అన్నారు. ఈ ఇండ్లను 37ఏండ్ల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని ఈరోజుతో వారి కల నెరవేరిందని అన్నారు.
నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడంతో నా జీవితం ధన్యమైందని అన్నారు. గతంలో కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో పేదల ఇండ్ల స్థలాల కోసం గత ప్రభుత్వాలతో పోరాటం కూడా చేశానని అయినా అప్పటి ప్రభుత్వాలు నిరుపేదలను గుర్తించలేదని విమర్శించారు.
తెలంగాణలో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నారని సూచించారు. ఏ ప్రభుత్వాలు చేయని పని చేస్తున్నామని అన్నారు. జిఓ 58ప్రకారం పట్టాలు పొందిన ప్రతీ ఒక్కరికీ గృహ లక్ష్మి కింద మూడు లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు. అతి త్వరలో పశ్చిమ నియోజకవర్గంలో 348 పట్టాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు గృహ లక్ష్మి కింద 3 లక్షల ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ గుంటి రజిత శ్రీనివాస్, ఆర్డీవో వాసు చంద్ర, హన్మకొండ ఎమ్మార్వో రాజు కుమార్, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నిరుపేద లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.