Site icon vidhaatha

Warangal | టార్గెట్ మోడీ.. బీజేపీ

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా కనపరుస్తున్న నిర్లక్ష్యంపై విపక్ష పార్టీలు కన్నెర్ర చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన వరంగల్ రానున్న నేపథ్యంలో విపక్షాలు విభజన హామీలను ఎజెండాపైకి తెచ్చారు. గత వారం రోజులుగా విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష పట్ల విమర్శలు చేస్తున్నారు.

మూడు ప్రధాన డిమాండ్లు

ముఖ్యంగా విభజన హామీలలోని మూడు ప్రధాన డిమాండ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినవి కావడం గమనార్హం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విభజన హామీలల్లో ఉమ్మడి జిల్లాకు చెందినవి కావడంతో స్థానిక రాజకీయ పక్షాలన్నీ ప్రధాని పర్యటన నేపథ్యంలో మూకుమ్మడిగా విరుచుక పడుతున్నాయి.

గొంతెత్తిన విపక్ష పార్టీలు

రాష్ట్రంలో అధికార పార్టీ, కేంద్రంలో విపక్ష పార్టీగా ఉన్న బి ఆర్ ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సి పిఐ ఎంఎల్ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు ప్రధాని మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో విభజన హామీలపై ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచించేందుకు ప్రధాని పర్యటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ముఖం పెట్టుకొని ప్రధాని వరంగల్ పర్యటనకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధాని పర్యటనలో విభజన హామీల పట్ల స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్, సిపిఎం రాజకీయ పక్షాలు మీడియా సమావేశాలకు పరిమితమై విమర్శిస్తుండగా సిపిఐ శుక్రవారం నిరసన దీక్షకు సిద్ధమైంది.

దళిత బహుజన, ప్రజా సంఘాలు గురువారం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన తెలియజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, జంగా రాఘవరెడ్డి తదితరులు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కోసమే మోడీ పర్యటన: చీఫ్ విప్ దాస్యం

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై వరంగల్ కు వచ్చే ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ గురువారం కాజీపేట మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతోపాటు డివిజన్ గా మార్చే విషయంపై మోదీ ప్రకటన చేయాలని కోరారు.

మోదీ వస్తే ఎన్నికలు రావడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మోదీ పోయాక ఈడీ రావడం కొనసాగుతోందన్నారు. మోదీకి ఈడీకి ఇంటర్ లింక్ ఉందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం అంటున్నారు కానీ, ఇప్పటి వరకూ DPR లేదన్నారు.ఎన్నికల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు మొండిచేయి చూపడం ఖాయమన్నారు.

విభజన హామీల పట్ల మోడీ నిర్లక్ష్యం: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరూరి

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనీ బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్,స్థానిక కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం కక్ష్యాపూరితంగానే విస్మరిస్తున్నారని విమర్శించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకుండా కేవలం వ్యాగన్ల మరమ్మతులు చేసే సెంటర్ ను మాత్రమే ప్రారంభించేందుకు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ కాజీపేటకు వస్తుండడంపై వరంగల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

ఏకశిలా పార్కు వద్ద సీపీఐ నిరసన

కాజీపేట కోచ్ పరిశ్రమ, బయ్యారం ఉక్కుపరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీ విభజన హామీల అమలు చట్టంపై ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ
సిపిఐ వరంగల్, హనుమకొండ జిల్లా సమితిల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు హాజరవుతారని రెండు జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవితెలిపారు.

దురంహంకార మోదీ గో బ్యాక్.. ప్రజా సంఘాల నిరసన

దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న దురహంకార ప్రధాని మోడీ గో బాక్ అంటూ హన్మకొండ జిల్లా కేంద్రం అంబెడ్కర్ సెంటర్ లో విసికె పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేసారు.

మోడీ వరంగల్ పర్యటనను వ్యతిరేకిస్తూ విముక్త చిరుతల కక్షి పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్,బిసి స్టడీ ఫోరమ్ చైర్మన్ సాయిని నరేందర్, విసికె పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version