Warangal
- రెండు రోజుల పాటు అమరుల సభ
- ఘనంగా మావోయిస్టుల నివాళులు
- రాష్ట్ర సరిహద్దుల్లో భారీ సభ
- భారీ ఊరేగింపు మారు మోగిన నినాదాలు
- పెద్ద సంఖ్యలో హాజరైన జనం
- ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అమరుల సంస్మరణ, ప్రభుత్వ విప్లవ వ్యతిరేక విధానాలపై నిరసన, అమరవీరులకు జోహార్లు అంటూ, విప్లవం వర్ధిల్లాలని గొంత్తెత్తిన నినాదాలు మధ్య మావోయిస్టులు అమరవీరుల సంస్మరణ సభను దండకారణ్యంలో భారీ ఎత్తున హాజరైన ప్రజల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపు జరిపారు.
దండకారణ్యం రాష్ట్ర సరిహద్దుల్లో
జులై 28 అమర వీరుల సంస్కరణ వారం దండకారణ్యం – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో విప్లవ ప్రజానీకం ఈ నెల 2వ,3వ తేదీలలో రెండు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ సోషలిజాన్ని నిర్మించడంలో భాగంగా నూతన ప్రజా స్వామిక విప్లవ విజయం కోసం మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులు,
మహోపాధ్యాయులు కా. చారు మజుందార్, డా. కన్హయ్ చటర్జీలు చూపిన ప్రజా యుద్ధ మార్గంలో సామ్రాజ్యవాద, దళారీ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు సభ వివరాలను పార్టీ ప్రతినిధులు మీడియాకు విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్, దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగాల్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోని వివరాలిలా ఉన్నాయి.
వ్యూహాత్మక దాడులకు ఎదురు తిరిగి..
విప్లవ ప్రతిఘాతుక సమాధాన్, సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడులను విరోచితంగా ఎదుర్కొంటూ నెత్తురు చిందించిన అమరులకు ఘనంగా నివాళులు అర్పించడానికి రెండు రాష్ట్రాల సరిహద్దు విప్లవ ప్రజానీకం పెద్దలు, చిన్నలు యువకులు, యువతులు, మహిళలు, అమరుల కుటుంబాలు, బంధు మిత్రులు, సన్నిహితులు తండోపా తండాలుగా తరలి వచ్చారు. తమ కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించు కోవడానికి ఒక రోజు ముందుగానే సభ స్థలానికి చేరుకున్నారు.
తొలిరోజు భారీ ఊరేగింపు
2వ తేదీన ఉదయం 11.00 గంటలకు 30 నిమిషాల దూరం నుండి ఊరెగింపుగా సభా స్థలానికి బయల్దేరారు. పంచాయితీల వారిగా బ్యానర్లు, ప్లేకార్డ్స్ చేత బూనీ అమర వీరుల ఆశయాలను తుద వరకు కొనసాగిద్దాం. సామ్రాజ్య వాదం, దళారీ నిరంకుశ బూర్జువా వర్గం, భూస్వామం నశించాలి. నూతన ప్రజా స్వామిక విప్లవం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి.
మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వర్ధిల్లాలి. అమరుల పేరు పేరునా అమర్ రహై, విప్లవ ప్రతిఘాతుక వ్యూహాత్మక దాడులను ఓడిద్దాం. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడిద్దాం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ సాగింది. గ్రామ, పంచాయితి, సిఎన్ఎం బృంధాలతో డప్పు వాయిద్యాల
నడుమ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సమరోత్సహాంతో ప్రవహంలా ఊరింగింపు సాగింది.
జన సంద్రమైన సభ
ప్రజలు సభ ప్రాంగణానికి భారిగా చేరడంతో సభ ప్రాంగణం కాస్త జనసంద్రంగా మారింది. నినాదాల హోరు, పాటల జోరు నలుదిక్కులా మారు మ్రోగుతూ వచ్చిన విప్లవ ప్రజా దండు ఎగరడానికి సిద్ధంగా ఉన్నా జెండా ముందు క్రమ పద్దతిలో బారులు తీరిన జనం రెడ్ సెల్యూట్ చేస్తూ నిలుచున్నారు. ప్రోటో కాల్ కమాండర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిని ఫాలో అవుట్ చేయగానే ముందుకు వెళ్ళి జెండాను ఎత్తడంతో రెడ్ సెల్యూట్ చేసి వున్నా జనం మేల్కోండి పేద ప్రజలారా అనే ఇంటర్నేషనల్ జెండా గీతాన్ని ఆలపించారు.
ఆ తరువాత అమరుడు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రజల ప్రియతమ నాయకుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, దూల దాదా స్మారకార్ధం మూడు పంచాయితీల జనతన సర్కార్ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఎంతో అద్భుతంగా, సుందరంగా నిర్మించుకున్న స్థూపాన్ని కా.ఆనంద్ సహచరి కా. పద్మ అవిష్కరించింది.
అనంతరం జోహార్లు పాటను కూడా ఆలపించారు. ఆ తరువాత అమర వీరుల త్యాగాలను ఎత్తిపడుతూ వారి ఆదర్శాలను ప్రేరణగా తీసుకొని అమరుల ఆశయాలను పరి పూర్తి చేయాలని ఉపన్యాసం సాగింది. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు తలవంచి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వక్తలు ప్రజలనుద్దేశించి ఉపన్యాసించారు.
ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం
అమర వీరుల త్యాగాలను ఎత్తి పడుతూ వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. 2047 వరకు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామనే పేరుతో సామ్రాజ్య వాదులకు, దళారీ దోపిడి వర్గాలకు వేగంగా దోచి పెట్టడానికి భారత్‌ను అఖండ హిందూ రాజ్యంగా మార్చడానికి దేశంలో ఫాసిజాన్ని అమలు చేస్తుంది. అందుకే హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రప్రధమ కర్తవ్యం భారత ప్రజలపై వుందని పిలుపునిచ్చారు.
మణిపూర్ లో కుకి ఆదివాసి ప్రజలపై మైదాన ప్రాంత మైతి ప్రజలను రాజ్యంగా విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కలిపి రెండు సామాజిక ప్రజల మద్య చిచ్చును రగల్చి క్రిస్టియన్, హిందూ ప్రజల మద్య తీవ్రమైన మత ఘర్షణలు సృష్టించిన తాజా ఉదహరణ ఈ రోజు మనకు లైవ్ లో కనబడుతుంది. భారత దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ప్రధాన ప్రమాదకారిగా మారిందని, అది భారత ప్రజల ప్రధాన శతృవు అని అన్నారు.
నేడు రాజకీయ, ఆర్ధిక, సామాజిక అసమానతలకు కారణమైన సామ్రాజ్య వాదాన్ని, దళారీ దోపిడి వర్గాలను, భారత ప్రజలపై హిందుత్వాన్ని బలవంతంగా రుద్దుతున్న ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలను కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించడానికి ప్రజా స్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని
పిలుపునిచ్చారు.
అదే విధంగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటాలను, ప్రజా స్వామిక విప్లవాలను, జాతి ఉద్యమాలను నిర్మూలించడానికి సామ్రాజ్య వాదుల దన్నుతో దోపిడి పాలక వర్గాలు విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిని కొనసాగిస్తున్నాయి ఈ దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం వుందన్నారు. అమరులు నెలకొల్పిన ఆదర్శాలను ప్రేరణగా తీసుకుని వారి ఆశయాలను పరి పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అమరుల కుటుంబాలను వేదిక పై అహ్వానించి ప్రజలకు పరిచయం చేశారు. వాళ్ళు తమ కొడుకుల, బిడ్డల త్యాగాల గొప్పతన్నాన్ని ఎత్తిపడుతూ తమతో వున్నా అనుబంధాలను పంచుకున్నారు. వాళ్ళు తమ కుటుంబాల కోసం కాకుండా పీడిత ప్రజల కోసం ప్రాణాలివ్వడం గర్వంగా ఫీల్ అవుతూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో విప్లవ కారులు తయారు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చైతన్య నాట్ మంచ్, జన నాట్య మండలి సాంస్కృతిక కార్యక్రమాలు రెండు రోజులు ప్రజలను చైతన్య పరిచాయి. అమరుల పాటలు, దోపిడి పాలకుల విధానాలను, సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిని ఎండగడుతూ పాడిన పాటలు, నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. మీడియా మిత్రులకు లాల్ సలాం అంటూ పేర్కొన్నారు.