Warangal
- ధర్మ పోరాట దీక్షలో అధికార పార్టీల లొల్లి
- బిజెపి, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం
- ఇరు పార్టీల తీరుపై కాంగ్రెస్ ఇతర పార్టీల ఆగ్రహం
- రాజకీయ విమర్శలకు వేదికగా మారిన దీక్షా శిబిరం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాజీపేట ప్రాంత అభివృద్ధికి రైల్వే పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రైల్వే జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ధర్మ పోరాట దీక్ష రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు వేదికగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలలో మూడు పార్టీల మధ్య వాగ్వివాదం కొనసాగింది. బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాదన జరిగింది. అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన దీక్షలో నాయకుల విమర్శలు చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. అభివృద్ధి కంటే వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్మిక సంఘాలు దీక్ష చేపడితే పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన అధికారంలో ఉన్న బిజెపి, బీఆర్ఎస్ నాయకులు వేదికపై గొడవ పడడం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. అభివృద్ధికి ప్రయత్నించని పార్టీల నాయకులు రానున్న ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ, మరమ్మతు పి ఓ హెచ్ వర్క్ షాప్ శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేస్తూ కాజీపేట చౌరస్తాలో ఆదివారం ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు.
రాజకీయ లబ్ధి కోసం దీక్ష వేదికపైన ఇరుపార్టీల నాయకులు మీది తప్పంటే మీది తప్పు అంటూ ఆరోపణలు చేసుకోవడం పట్ల ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదంతా దీక్షను భగ్నం చేసే కుట్రగా కొందరు అభివర్ణించారు. ఈ దీక్షలకు టిఆర్ఎస్ నాయకులు జోరిక రమేష్, స్థానిక బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి, బిజెపి నాయకులు రావు పద్మ, రాకేష్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: BRS
టిఆర్ఎస్ నాయకుడు జోరిక రమేష్ మాట్లాడుతూ రైల్వే పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూమి కేటాయించినా కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ రాకుండా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత బిజెపి కాజీపేట అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి ఓట్లు పొందడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం: కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రైల్వే పరిశ్రమ ఏర్పాటుకు 150 ఎకరాలు కేటాయించినప్పటికీ మరొక 10 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉండగా కేటాయించకపోవడం కాజీపేట ప్రాంత అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించడమేనని అంటున్నారు.
నిధులు కేటాయించినప్పటికీ శంకుస్థాపన చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందన్నారు. అన్ని అర్హతలు ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయకపోవడం కేంద్రంలో ఉన్న బిజెపి స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమన్నారు.
రైల్వే ఆస్తులను అమ్ముకుంటూ కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు: BJP
బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందే అన్నారు. ఉన్నది ఉన్నట్టుగా అంటే బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఉలుకెందుకని విమర్శించారు. కాజీపేట రైల్వే అభివృధి కోసం బిజెపి కట్టుబడి ఉంది అని మరోసారి స్పష్టం చేస్తున్నాం. త్వరలోనే కాజీపేట PoHకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తారు. కాజీపేట డివిజన్ సాధన కొరకు కృషి చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, రైల్వే కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.