Local Bodies Elections | తాము గెలిచి శాసన, పార్లమెంటు సభ్యులై తమకు అధికార పగ్గాలు దక్కితే చాలూ.. మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు, పాలకవర్గాల ఏర్పాటు ఎక్కడపోతే మాకేందుకు అనే విధంగా పాలకపక్షాలు తయారయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అధికారం చేజిక్కించుకున్న తర్వాత పార్లమెంటు ఎన్నికలూ జరిగాయి. మధ్యలో ఖాళీ అయిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలూ జాప్యం లేకుండా దఫ దఫాలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల హవా కొనసాగుతున్నదనే విషయాన్ని ప్రజాప్రతినిధులు విమ్మరిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసిపోయిన విషయం తెలిసిందే. పాలకవర్గాల కాలపరిమితి పొడిగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీల చేతికి తాళాలు అప్పగించడమేంటనే రాజకీయ దృష్టితో ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. కానీ, తరువాత స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్, మండల పరిషత్, జీపీల ఎన్నికల నిర్వహణను గాలికి వదిలేసింది.
రాష్ట్ర ప్రభుత్వం జాప్యంతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలు అంశం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.. రూరల్ ప్రాంతాలు పరిఢవిల్లుతేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంగానే రాజ్యంగంలో స్థానిక సంస్థలకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. అయితే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ సకాలంలో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయాన్ని విస్మరించింది. దీంతో కాంగ్రెస్ తీరు పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంపై ఇప్పటికే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సర్కారును కోర్టు గట్టిగానే ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనే అంశాన్ని లేవనెత్తగా.. కుల గణన పూర్తి కాలేదని, మరింత సమయం కావాలని ప్రభుత్వం అడిగింది. ఇదే అంశం పై ఎన్నికల సంఘం అరవై రోజుల గడువు కోరింది. పిటిషనర్లు మాత్రం ఎన్నికలను తక్షణం నిర్వహించాలని, లేదా పాత సర్పంచ్‌ల కాలపరిమితిని పొడిగించాలని కోరారు. దీనిపై హైకోర్టు సుదీర్ఘంగా విచారించి, తీర్పును రిజర్వు చేసింది.
బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధం కాదని ప్రభుత్వం వాదనగా ఉంది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు స్థానిక సంస్థల ఎన్నికలు పునాదిగా నిలుస్తున్నాయి. దీనితో పాటు అణగారిన వర్గాలకు అందిస్తున్న రిజర్వేషన్ల అమలు సైతం ప్రాధాన్యతో కూడుకున్న విషయం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఈ రిజర్వేసన్లు అమలు కావాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్లమెంటులో చట్టరూపం పొందితే తప్పా అధికారికంగా అమలుకునోచుకునే పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఈ సమస్య రాజకీయ రంగు సృష్టించుకున్నది. ఈ సమస్య ఇప్పట్లో తేలుతుందా? లేదా? అనేది ఒక సమస్యగా మారింది.
తమకు చిత్తశుద్ధి ఉందని అందుకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. మిగతా రాజకీయ పార్టీలు కూడా 42శాతం సీట్లు కేటాయించి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలని కోరుతోంది. అయితే, రిజర్వేషన్లు అములు చేసే చిత్త శుద్ధి లేక మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు సాధించాలని అధికార పార్టీ ప్రణాళికలు మొదలు పెట్టింది. మరోవైపు విపక్షాలు కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య మాటల మంటలు మొదలు అవుతున్నాయి. విపక్ష పార్టీలు స్థానికంగా పట్టు సాధించుకునేందుకు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికార, విపక్షాల మధ్య రాజకీయ విమర్శలు స్థాయి దాటి విద్వేషాలుగా మారుతున్న సందర్భాలున్నాయి.