AP Government Buys New Helicopter: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు లేవంటూనే కొత్త మెర్సిడెస్ బెంజ్ హెలికాప్టర్ ఎలా కొనుగోలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆరోగ్యశ్రీకి నిధులు లేవని..అమ్మ ఒడికి నిధులు లేవని..అన్నదాతకు నిధులు లేవని..నిరుద్యోగ భృతికి నిధులు లేవని..ఇంటింటికి ఉద్యోగానికి నిధులు లేవని..మహిళలకు ఉచిత ప్రయాణానికి నిధులు లేవని నిత్యం మాట్లాడుతుందని విమర్శించారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను నిధులు లేవనే సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ మెర్సిడెస్ బెంజ్ కు నిధులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలకు ప్రజలకు జవాబు చెప్పాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రూ.176కోట్లతో కొత్త హెలికాప్టర్ కొనడం అవసరమా అంటూ వైసీపీ మండిపడుతోంది. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ రెడ్డి తన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల కోసం తనకు సన్నిహితులు అయిన ఏవియేషన్ కాంట్రాక్టర్లకు వందల కోట్లు ధారబోశారని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి దుబారా ఖర్చులకు బదులు అత్యాధునిక హెలికాఫ్టర్ ఒకటి కొంటే.. రాష్ట్రం మొత్తం దాంతోనే పర్యటించే అవకాశం ఉండేదని..అందుకే తమ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనగోలు చేసిందని కౌంటర్ వేస్తున్నారు. ఇప్పుడున్న హెలికాఫ్టర్ అంత అనుకూలంగా లేదని..అందుకే ప్రభుత్వ అవసరాల కోసమే కమిటీ వేసి మరి హెలికాప్టర్ కొన్నారని గుర్తు చేస్తున్నారు.