విధాత: ‘ఏవో రెండు మూడు సరుకులు కొనాలని నిన్న మాధాపూర్‌లో ఉన్న ఒక మార్ట్ (Mart)కు వెళ్లాను. అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి ఉంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు పంట పండిస్తున్నారు. వారిని చూసే మార్ట్ సెల్లారులోకి కారు మలిపాను. సెల్లారులో అస్తవ్యస్తంగా వాహనాలు నిలిపి ఉన్నాయి. ఎక్కడో చిన్న స్థలం చూసి కారు ఆపి లిఫ్టులో పైకి వెళ్లాను. లోపలికి వెళ్లేదారిలో నామమాత్రపు సెక్యూరిటీ చెక్ చేశారు. లోపల చూద్దునుగదా, ముందుకెళ్లే దారిలేదు. కిటకిటలాడుతున్నది. ఎదురుగా పది క్యాష్ కౌంటర్ల వద్ద పదేసి మంది క్యూలో ఉన్నారు. ఏదో తోసుకుని నాకు అవసరమైన సరుకులను వెదకుతున్నాను.
చిన్న చిన్న పిల్లలు, పెద్దలు, భార్యాభర్తలు ఎగబడి సరుకులు ఎంపిక చేసుకుంటున్నారు. పిల్లలు తమకు కావలసిన వస్తువులు అడుగుతున్నారు. తల్లిదండ్రులు సర్ది చెబుతున్నారు. నాకు కావలసినవి కింద అంతస్తులో లేవట. పై అంతస్తుకు వెళ్లాల్సిందిగా ఒక సహాయకుడు చెప్పాడు. జనాన్ని తోసుకుంటూ పైకి వెళ్లాను. పైన కూడా అదే పరిస్థితి. కిటకిటలాడుతున్నారు. హైదరాబాద్‌లో ఇంత జనం ఉన్నారా అనిపించేంత రద్దీ. అనవసరంగా ఆదివారం వచ్చానే అని నన్ను నేను తిట్టుకోవడం. ముందుకు కదులుతున్నాను.
ఒక చోట నాకు కావలసిన సరుకులు దొరికాయి. రెండే సరుకులు. చేతికి తీసుకున్న తర్వాత గుర్తుకు వచ్చింది – వీటికోసం ఎంతసేపు క్యూలో నిలబడాలి. గాలి సరిగా ఆడుతున్నట్టు లేదు. ఏదో అనీజీ. ఒక పిల్లవాడు నాన్నా నాకు కంపాస్ కావాలని అడుగుతున్నాడు. ఐస్ క్రీమ్ నాన్నా అని ఇంకో బుజ్జోడు గోలపెడుతున్నాడు. వాళ్లను చూడగానే నాకు ఎందుకో ఈ భవనంలో సేఫ్టీ, సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగానే ఉన్నాయా అన్న అనుమానం కలిగింది.
ఒక్కసారిగా గుండె ఝల్లుమన్నది. ఎగ్జిట్ బోర్డులు ఎక్కడ ఉన్నాయా అని చూశాను. మూడంతస్తుల భవనానికి, సుమారు రెండున్నర వేల మంది వరకు షాపింగ్ చేస్తున్న మార్టుకు ఒకటే ఎగ్జిట్. పై అంతస్తులో అన్ని వైపులా తిరిగి చూశాను. ఇంకో ఎగ్జిట్ లేదు. ఫైర్ సేఫ్టీ సామగ్రి కనిపించలేదు. ఇంతమందికి ఒకటే ఎగ్జిట్. అదీ కింది అంతస్తుకు వెళ్లడానికి, బయటికి వెళ్లడానికి కాదు. కింది అంతస్తులోనివారు పై అంతస్తు వారు అందరూ కింది అంతస్తులో ఉన్న రెండు మార్గాల ద్వారా మాత్రమే బయటికి వెళ్లాలి. నాకు గుండె దడ మొదలయింది.
ఇది చాలా అన్యాయం. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పిల్లలు ఏం కావాలి? ఈ వృద్ధులు ఎలా బయటపడతారు? అసలు ఈ జనమంతా ఎలా ప్రాణాలతో బయటపడతారు? జీహెచ్‌ఎంసీ, ఫైర్ సేఫ్టీ, పోలీసులు అసలు ఈ మార్ట్‌ను ఎప్పుడయినా సందర్శించారా? బయట ట్రాఫిక్ చలానాలు రాస్తున్న వారు, ఆ మార్ట్ ట్రాఫిక్ నియంత్రణకు మనుషులను పెట్టకపోవడాన్ని ప్రశ్నించారా? అనేక ప్రశ్నలు. భయాలు. ఒక్క క్షణం అందులో ఉండబుద్ధి కాలేదు. ఆగమేఘాలపై బయటికి వచ్చాను. సెల్లారులో కారును తీయడం ఒక యజ్ఞమైంది. జనం ఒకరిపట్ల ఒకరు మర్యాదగా వ్యవహరించారు కాబట్టి కార్లను మెల్లగా జరుపుకొంటూ జరుపుకొంటూ బతుకుజీవుడా అంటూ బయటపడ్డాను.
అయ్యా, నగర పాలకులారా? జీహెచ్ఎంసీ ఏలికలారా! ఒక్కసారి ఆది, శనివారాల్లో ఇలాంటి మార్టులను సందర్శించండి. ఇటీవల సికింద్రాబాద్ స్వప్నలోక్ షాపింగ్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఇందుకే కదా ఆరుమంది అమాయకులు ప్రాణాలు మసిగా మారిపోయిందనే విషయం గుర్తుచ్చొంది. డెక్కన్ స్పోర్ట్స్ మాల్‌లో ముగ్గురు కాలి బూడిదయిన విషయం గుర్తుకు వచ్చింది. ఏదో జరిగి మానవత్వం బుగ్గి అయిపోతే అప్పుడు తీరిగ్గా సంతాపాలు, సమీక్షలు, చర్యలు అంటూ బాతాఖానీలు కొట్టకండి. ఇది చిన్న విషయం కాదనిపించి ఈ ఘోష’- ఇదీ మా పొరుగున ఉండే ఒక పౌరుడు వ్యక్తం చేసిన ఆందోళన, ఆవేద