Assigned Lands | అసైన్డ్ హక్కులకు దిక్కెవరు?

Assigned Lands | బలహీన వర్గాలకు గతంలో భూ పంపకం అభివృద్ధి పేరిట లాక్కుంటున్న ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో ఒకలా.. మన రాష్ట్రంలో మరోలా రాష్ట్రంలో 14 లక్షల మంది అసైన్డ్‌ రైతులు 24 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అసైన్డ్ భూములు కలగా మారిన అసైన్డ్‌ భూమిపై శాశ్వత హక్కులు విధాత, హైద‌రాబాద్ ప్ర‌తినిధి: పడావు పడిన ప్రభుత్వ భూములను పచ్చని పైరు పంటలకు నెలవుగా మార్చిన అన్నదాతల శ్రమను గుర్తించిన నాటి ప్రభుత్వాలు అసైన్డ్‌ చట్టం […]

  • Publish Date - June 27, 2023 / 01:57 AM IST

Assigned Lands |

  • బలహీన వర్గాలకు గతంలో భూ పంపకం
  • అభివృద్ధి పేరిట లాక్కుంటున్న ప్రభుత్వాలు
  • ఇతర రాష్ట్రాల్లో ఒకలా.. మన రాష్ట్రంలో మరోలా
  • రాష్ట్రంలో 14 లక్షల మంది అసైన్డ్‌ రైతులు
  • 24 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అసైన్డ్ భూములు
  • కలగా మారిన అసైన్డ్‌ భూమిపై శాశ్వత హక్కులు

విధాత, హైద‌రాబాద్ ప్ర‌తినిధి: పడావు పడిన ప్రభుత్వ భూములను పచ్చని పైరు పంటలకు నెలవుగా మార్చిన అన్నదాతల శ్రమను గుర్తించిన నాటి ప్రభుత్వాలు అసైన్డ్‌ చట్టం అమలుకు శ్రీకారం చుడితే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఆ చట్టాల స్ఫూర్తిని దెబ్బతీశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అసైన్డ్‌ భూములపై కొంతకాలం తరువాత శాశ్వత హక్కులు దక్కాయి.

తెలంగాణలో మాత్రం అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కుల సంగతి అలా ఉంచితే ఆరున్నర దశాబ్ధాల ముందునుంచి సాగు చేసుకుంటున్న భూములను అభివృద్ది పేరుతో ప్రభుత్వమే లాక్కుంటుండటంతో అసైన్డ్‌ రైతుల హక్కులకు దిక్కులేకుండా పోయింది. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించాలనుకున్నప్పుడు పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం చెల్లించాలని భూ సేకరణ చట్టం-2013 ప్రకారం నిబంధనలున్నాయి.

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అనేక తాగు, సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, ఉదయ సముద్రం, పాలమూరు రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతల, సుంకిశాల, బస్వాపూర్, సంగమేశ్వర- బసవేశ్వర ఇలా అనేక ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం భూమిని సేకరించింది. 28 జిల్లాల్లో నూతనంగా సమీకృత కలెక్టరేట్లను నిర్మించింది.

ప్రాజెక్టుల కోసం, కలెక్టరేట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రభుత్వం సేకరించిన భూముల్లో అసైన్డ్‌ భూములే ఎక్కువని అంటున్నారు. చాలా జిల్లాల్లో అసైన్డ్‌ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే నిర్ధాక్షిణ్యంగా భూములను స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా పదివేల ఎకరాలను ప్రభుత్వం ఇలా తీసుకున్నదని తెలుస్తున్నది. మరోవైపు 30వేల ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నదని సమాచారం.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

అసైన్డ్ భూముల వ్యవహారం తెలంగాణలో ఒకలా ఉంటే.. ఇతర రాష్ట్రాల్లో మరోలా ఉంది. కర్ణాటకలో 15 ఏండ్లకు అసైన్ దారులకు ఆసైన్డ్ భూములపై శాశ్వత, సర్వహక్కులను కల్పిస్తున్నారు. తమిళనాడులో 28 ఏండ్లకు, కేరళలో 25, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో పదేండ్లకు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో నిర్ణీత గడువు తరువాత అసైన్డ్ భూములపై కూడా అధికారికంగానే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. తెలంగాణలో కనీసం 30 సంవత్సరాల తరువాతైనా ఆసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నది.

కానీ అమలుకు నోచుకోవడం లేదు. అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించకపోవడం వలన అసైన్డ్ దారులు చాలా రకాలుగా నష్ట పోతున్నారు. ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లకు బ్యాంకులలో కుదవ పెట్టే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లుగా మార్చి ఇతరులకు ఇండ్ల స్థలాలుగా విక్రయించారు. తక్కువ ధరకు వస్తుండటంలో చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లను బాండ్‌ పేపర్లపై, నోటరీలపై కొనుగోలు చేశారు. వీటికి సేల్‌ డీడ్స్‌ ఉండకపోవడం ఇబ్బందులకు దారి తీస్తున్నది

అసైన్డ్ భూముల కేటాయింపు ఇలా..

సాగుభూమి లేని రైతుల జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో నాటి ప్రభుత్వాలు 1958 కంటే ముందు, ఆ తరువాత కాలంలో అర్హులైన రైతులకు అసైన్డ్ పట్టాలను జారీ చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1958 నుంచి 2017 వరకు సుమారు 24,08,570 లక్షల ఎకరాలను 14,67,226 లక్షల మంది భూమిని అందజేశారు. సాధారణంగా అసైన్డ్ భూములను రెండు రకాలుగా కేటాయించారు. 1958 కంటే ముందు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం వేలం ద్వారా అసైన్డ్ భూములను కేటాయించింది.

అయితే.. అప్పటి వరకు ప్రభుత్వానికి చెల్లిస్తున్న శిస్తులో సుమారు నాలుగు వంతులు అదనంగా చెల్లించాలనే నిబంధనను అమలు చేయడంతో పాటు 1958 జూలై 25వ తేదీని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించారు. అనంతరం 9-జీ పట్టాలను జారీ చేసి అర్హులకు అసైన్డ్ భూములను అప్పగించారు. ఏపీలో మాత్రం 1955వ సంవత్సరం కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు.

ఆ తరువాత వేలం ద్వారా కాకుండా భూమిలేని పేదలకు ఉచితంగా ప్రభుత్వ భూములపై అసైన్డ్ పట్టాలను జారీ చేయాలని అప్పటి ప్రభుత్వం జీవో – 1406ను విడుదల చేసింది. అయితే అసైన్డ్ భూములను అమ్మవద్దు కొనవద్దు అనే నిబంధన విధించి, 9- జీ పట్టాలను జారీ చేశారు. వీటిని అప్పట్లో లావుని పట్టాలు అని కూడా పిలిచేవారు.

అమల్లోకి పీవోటీ చట్టం-1977..

అయితే అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, క్రయవిక్రయాలు నిత్యకృత్యం కావడంతో 1977లో అప్పటి ప్రభుత్వం పీవోటీ (అసైన్డ్ ల్యాండ్స్ – ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రన్స్‌ఫర్‌ – 1977) చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం అసైన్డ్ భూములను అమ్మినా.. కొనుగోలు చేసినా.. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని మళ్లీ అసైన్‌దారుకు కేటాయించాలి.

ఒకవేళ మొదటగా అసైన్డ్ భూమిని పొందిన రైతుకు సుమారు 5 ఎకరాల పైబడి భూమి ఉన్నట్లైతే.. భూమిలేని మరో వ్యక్తికి ఆ భూమిని కేటాయించాలి. పీఓటీ చట్టాన్ని అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష అని నిబంధన కూడా విధించారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపం కారణంగా అసైన్డ్ భూములపై అనేక అక్రమాలు, క్రయవిక్రయాలు కొనసాగాయి.

2007లో క్రమబద్ధీకరణ..

నగర శివారుతో పాటు రాష్ట్రంలో పట్టణీకరణ ఎక్కువగా జరిగిన ప్రాంతాల సమీపంలో అసైన్డ్ భూములను కోనుగోలు చేసిన వారిలో అత్యధికంగా సీమాంధ్ర వ్యక్తులు, రియల్టర్లే ఉన్నారు. అందువల్లే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007లో పీవోటీ చట్టం-1977ను సవరించారనే అభిప్రాయాలూ ఉన్నాయి.

ఇందులో భాగంగా 2007 జనవరి 29ను కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించి అంతకు ముందు క్రయవిక్రయాలు జరిగిన అసైన్డ్ భూములను క్రమబద్దీకరించారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి బాటలోనే నడిచిన కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ 2018లో పీవోటీ చట్టం – 1977ను సవరించడంతో పాటు 2017 డిసెంబర్ 31 కట్ ఆఫ్‌ డేట్‌గా నిర్ణయించి 3-5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఆధీనంలోని అసైన్డ్ భూములను క్రమబద్దీకరించారు.

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌…

ఏపీలో 1954 జూన్ 18, తెలంగాణ ప్రాంతంలో 1958 జూలై 25 తేదీ కంటే ముందు అసైన్ చేసిన భూములపై అర్హులైన రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశిస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఈ ఆదేశాల అమలుకు అక్కడి ప్రభుత్వం.. 2018 నవంబర్ 16న జీవో ఇచ్చింది. కానీ తెలంగాణలో హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయని కారణంగా నిజమైన అసైన్డ్‌దారులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి పది జిల్లాలలో అసైన్డ్‌ రైతులు, రైతులకు కేటాయించిన భూ విస్తీర్ణం వివరాలు..