Wife Murder | వారిది ప్రేమ వివాహం( Love Marriage ).. పండంటి ఇద్దరు పిల్లలు.. అలా సాఫీగా వారి సంసార జీవితంలో అనుమానం పెనుభూతమైంది. అనుమానంతో భార్యను చంపి, ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం శరీర భాగాలను తన ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్( Chhattisgarh ) బిలాస్‌పూర్ జిల్లాలో రెండు నెలల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బిలాస్‌పూర్ తఖాత్‌పూర్ గ్రామానికి చెందిన పవన్ ఠాకూర్ అనే యువకుడు గీతాంజలి నగర్‌లో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా పవన్ సీసీటీవీ కెమెరాలు బిగించే పని చేస్తున్నాడు. అయితే అతనికి కొన్నేండ్ల క్రితం సతి సాహు అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ ఐదేండ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. అయితే భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం ఏర్పడింది. దీంతో ఆమెను మట్టుబెట్టాలని పవన్ నిర్ణయించుకున్నాడు.
ఇద్దరు పిల్లలను ఇంటికి పంపి..
ఇక భార్యను చంపాలని నిర్ణయించుకున్న పవన్.. తన ఇద్దరు పిల్లలను రెండు నెలల క్రితం స్వగ్రామంలో విడిచిపెట్టాడు. అనంతరం భార్యను చంపేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. తన ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో దాచి పెట్టాడు.
దొంగతనం కేసుతో భార్య హత్య వెలుగులోకి..
పవన్ ఇటీవలే ఓ దొంగతనం కేసులో పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆదివారం పవన్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించగా మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని విచారిచంగా ఆ శరీర భాగాలు తన భార్యవే అని చెప్పాడు. దీంతో భార్య హత్య వెలుగులోకి వచ్చింది.