JD Lakshmi Narayana |
విధాత: జగన్ కేసుల్లో అసాధారణ ప్రాచుర్యం పొందిన సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పరిస్థితి ఇప్పుడు ఎటు కాకుండా పోయింది. జగన్ కేసులలో ఛార్జ్ షీట్ వేసేశాక అయన 2018లోనే స్వచ్చంద విరమణ చేసారు. అయితే అయన సర్విసులో ఉన్నపుడు అయన ఇచ్చిన ఇన్ పుట్స్ తీసుకుని విస్తృతంగా వార్తలు వండి వార్చిన మీడియా సంస్థలు ఆ తరువాత ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు.
అప్పట్లో ఆయను నాలుగో సింహం అని కీర్తించిన వాళ్లంతా అయన రిటైర్ అయ్యాక మెల్లగా సేడ్ అయిపోయారు. ఐతే 2019లో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసిన అయన 2. 8 లక్షల ఓట్లు తెచ్చుకుని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తరువాత మాత్రం ఆ పార్టీలో నిలువలేక పక్కకు వచ్చేసారు. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు, స్కూళ్ళు, విద్యాసంస్థల్లో పిల్లలకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతూ వస్తున్నారు. సందర్భం వచ్చినపుడల్లా జగన్ పరిపాలనను, పాలనా సంస్కరణలు, సచివాలయం, నాడు – నేడు వంటి పనులను మెచ్చుకుంటూ ఉన్నారు. అలాగని అయన నేరుగా జగన్ పక్షాన చేరేందుకు అవకాశం లేదు.
పోయినీ టీడీపీలో చేరుతారా అంటే అక్కడ అవకాశం లేనట్లే ఉంది. దీంతో అయన మళ్ళీ ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం మినహా మరే మార్గం కనిపించడం లేదు. దీంతో అయన స్వతంత్రంగా పోటీకి మళ్ళీ రెడీ అవుతున్నారు. అయితే ఈసారి విశాఖ నుంచా.. ఇంకెక్కడైనా అన్నది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.