Site icon vidhaatha

Yennam Srinivas Reddy | యన్నం శ్రీనివాస్‌రెడ్డి దారెటు?

Yennam Srinivas Reddy

విధాత, మహబూబ్‌నగర్ ప్రతినిధి: మహబూబ్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిందా? ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్న యన్నం.. అదే పార్టీలో కొనసాగుతారా? లేక కాంగ్రెస్‌లో చేరుతారా? అన్న అంశంపై జిల్లాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మొదట్లో బీఆరెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన అనంతరం బీజేపీలో చేరారు.

అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్వర్ రెడ్డి మృతి చెందడంతో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బీఆరెస్‌ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంపై బీజేపీ అభ్యర్థిగా యన్నం భారీ విజయం సొoతం చేసుకున్నారు. మళ్ళీ రెండేండ్లకు వచ్చిన (2014) సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యన్నం బీఆరెస్ అభ్యర్థి వీ శ్రీనివాస్‌గౌడ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.

కొద్ది రోజుల తరువాత యెన్నం కాంగ్రెస్‌లో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మళ్లీ మహబూబ్ నగర్ నియోజకవర్గం టికెట్‌ వస్తుందని ఆశించారు. అయితే.. ఆ సమయంలో టీడీపీ, కాంగ్రెస్, ఇంకా పలు పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ పార్టీల పొత్తుల నేపథ్యంలో మహబూబ్‌నగర్ సీటు టీడీపీకి కేటాయించారు. మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నేత ఎం చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్)కు టికెట్ వచ్చింది.

కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ యన్నం కొంత కాలం తరువాత తిరిగి బీజేపీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ నేతలంతా తమ తమ నియోజకవర్గం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీలో ఉంటే విజయం సాధిస్తామో లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా మారడంతో ఇతర పార్టీల నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు.

ఈ సమయంలో బీజేపీలో ఉండి టికెట్‌ తెచ్చుకున్నా యన్నం గెలుపు కష్టమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నదన్న ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎన్నికలు యెన్నం పోటీతో రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

Exit mobile version