Telangana | ఆగస్టులో తొలి జాబితాలు? అన్ని పార్టీలకూ అదే ముహూర్తం!

Telangana | బీఆరెస్‌ నుంచి మూడు దఫాల్లో తొలి జాబితాలో 30 నుంచి 40 50-60 మందితో కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ బీసీలకు గరిష్ఠంగా 30 సీట్లు? లెఫ్ట్‌ నేతలు కలిసొస్తారని ఆశ విధాత: ఆగస్టులో అధికారపార్టీ మొదటి దఫా అభ్యర్థుల జాబితా విడుదల కానున్నదా? సర్వేల ఆధారంగా సీఎం తొలుత 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారా? మొత్తం మూడు దఫాలుగా అభ్యర్థులను ఎంపిక చేస్తారా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నయి. ఇప్పటికే […]

  • Publish Date - July 27, 2023 / 02:59 AM IST

Telangana |

  • బీఆరెస్‌ నుంచి మూడు దఫాల్లో
  • తొలి జాబితాలో 30 నుంచి 40
  • 50-60 మందితో కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌
  • బీసీలకు గరిష్ఠంగా 30 సీట్లు?
  • లెఫ్ట్‌ నేతలు కలిసొస్తారని ఆశ

విధాత: ఆగస్టులో అధికారపార్టీ మొదటి దఫా అభ్యర్థుల జాబితా విడుదల కానున్నదా? సర్వేల ఆధారంగా సీఎం తొలుత 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారా? మొత్తం మూడు దఫాలుగా అభ్యర్థులను ఎంపిక చేస్తారా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నయి. ఇప్పటికే నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో అలాంటి 20-25 స్థానాల్లో అభ్యర్థులను మార్చడమా? లేక వారినే కొనసాగించడమా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

అందుకే వివాదాలు లేని, పనితీరు బాగున్న ఎమ్మెల్యేలతో తొలి జాబితాను ముందుగా ప్రకటించి, తర్వాత మిగిలిన రెండు దఫాల్లో పూర్తిస్థాయి జాబితాను విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఒకవేళ పార్టీలో తిరుగుబాట్లు వచ్చినా, నిరసనలు వ్యక్తమైనా ఎన్నికల నాటికి సర్దిచెప్పవచ్చనే అభిప్రాయం అధినేత వ్యక్తం చేశారట. అందుకే ఆగస్టు మొదటి, రెండో వారాల్లోనే తొలి జాబితా వస్తుందంటున్నారు.

కాంగ్రెస్‌ సైతం సిద్ధం!

కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా కర్ణాటకలో వలే ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగా 50-60 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్టీ అధిష్ఠాన పెద్దలు, టీపీసీసీ అధ్యక్షుడు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు మొదటి జాబితాపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తున్నది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 25 -30 వరకు బీసీలకు టికెట్లు కేటాయించాలని వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ముందు నుంచే పట్టున్నది. బీసీలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాలను తమ వైపు తిప్పుకొని అధికార పార్టీపై ఆధిక్యతను ప్రదర్శించాలనుకుంటున్నది. ‘ఇండియా’ కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి కొన్ని నియోజకవర్గాను వారికి వదిలేయాల్సి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీఆరెస్‌ నుంచి వామపక్షాలకు సానుకూల స్పందన రావడం లేదు. దీంతో వాళ్లు దాదాపు ఆ పార్టీకి దూరమైనట్టేనని భావిస్తున్నారు.

వేచి చూసే ధోరణిలో బీజేపీ!

బీజేపీ మాత్రం చివరి దాకా వేచి చూసే ధోరణిలో ఉన్నది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఆ పార్టీలో ఎంత మంది ఉంటారన్నది ఆ పార్టీ నేతలకే స్పష్టత లేదంటున్నారు. అందుకే అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారవుతుందని పార్టీ పెద్దలు అనుమానిస్తున్నారని సమాచారం.

వాస్తవానికి ఎన్నికల నాటికి అధికారపార్టీ నుంచి వలసలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేననే ప్రచారం జరుగుతుండటం, దానికి బలం చేకూర్చేలా సాగుతున్న పరిణామాలు దీనికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జాబితాల తర్వాత బీజేపీ 15-25 మందితో తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి.

ప్రయత్నాల్లో ఆశావహులు ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆశావహులు టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టారు. పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఆగస్టు మాసంలో అన్నిపార్టీల్లో అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అన్ని పార్టీల్లోనూ అసంతృప్త గళాలు వినిపించవచ్చు. ఈ అసమ్మతి స్వరాల్లో బీఆరెస్‌, బీజేపీ నుంచే ఎక్కువ ఉంటాయనే చర్చ నడుస్తున్నది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మధ్య అవగాహన కుదిరితే వారికి కేటాయించాల్సిన కసరత్తు కూడా ఆగస్టులోనే ముగిస్తారని తెలుస్తున్నది.