World Cup 2023 | హైదరాబాద్‌లో.. టీమిండియా మ్యాచ్ ఒక్కటీ లేదు..

World Cup విధాత‌: మొన్న‌టి వ‌ర‌కూ ట్వంటీ -20 మ్యాచులు చూసి తెగ ఎంజాయ్ చేసిన తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ తీవ్ర నిరాశే మిగిల్చింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియాకు మాత్రం ఒక మ్యాచ్ కూడా లేక‌పోవ‌డంతో చాలా అప్‌సెట్ అయ్యారు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మాత్రం […]

  • Publish Date - June 27, 2023 / 12:59 PM IST

World Cup

విధాత‌: మొన్న‌టి వ‌ర‌కూ ట్వంటీ -20 మ్యాచులు చూసి తెగ ఎంజాయ్ చేసిన తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ తీవ్ర నిరాశే మిగిల్చింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియాకు మాత్రం ఒక మ్యాచ్ కూడా లేక‌పోవ‌డంతో చాలా అప్‌సెట్ అయ్యారు.

లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మాత్రం లేదు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించక‌పోవ‌డంతో ఒక వేళ భారత జట్టు సెమీ ఫైనల్, ఫైనల్ చేరినప్పటికీ టీమిండియాను హైదరాబాద్‌లో చూసే అవకాశాలు లేక‌పోవ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

నిజానికి మొదట భారత్, పాకిస్థాన్ మ్యాచ్ హైదరాబాద్‌లోనే జరగనుందనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే హైదరాబాద్‌లో లీగ్ స్టేజ్‌లోని 3 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

అక్టోబర్ 6న జరగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 1 జట్టుతో ఆడనుంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్ జట్టు క్వాలిఫైయర్ 1 జట్టుతో ఉప్పల్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 12న పాకిస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 2 జట్టుతో హైద‌రాబాద్‌లోనే ఆడనుంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ముగుస్తాయి.

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పంద‌న ఇది!

దేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ అత్యంత పోటీతో కూడుకుని ఉంటుంద‌ని భార‌త క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నారు. ట్వంటీ-20 క్రికెట్ అన్ని ఫార్మాట్‌లను ప్రభావితం చేసిందన్నారు. ‘ఈ ప్రపంచ కప్ చాలా పోటీని ఇస్తుంది, ఎందుకంటే ఆట వేగంగా మారింది, జట్లు గతంలో కంటే సానుకూలంగా ఆడుతున్నాయి” అని రోహిత్ పేర్కొన్నాడు.