Yadadri Bhuvanagiri
విధాత: మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆలేరు మండలంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగించారు.
రఘునాథపురం మండల కేంద్ర డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న అఖిలపక్షానికి మద్దతు ప్రకటించారు. పాదయాత్ర సభలలో భట్టి మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిపోయిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయన్నారు. 9 ఏళ్లలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకసారి వేసి ప్రశ్నపత్రాలను లీక్ చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం రెట్టింపు కావడం జరిగిందన్నారు.
ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రశ్నించిన ప్రతిపక్షాలపై, ప్రజలపై అణిచివేతకు పాల్పడుతుందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో, పథకాల అమలులో మంత్రులు ఎమ్మెల్యేలు కమీషన్లు దండుకుంటున్నారన్నారు. పేదల భూములను లాక్కునేందుకు ధరణితో కుట్ర చేస్తున్నారన్నారు. కెసిఆర్ కుటుంబం మొత్తం పలు స్కాములలో కురుకుపోగా, వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని, దళిత బంధు తరహాలో కూలి బంధు కూడా అమలు చేస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
అవినీతి, కుటుంబ పాలన చేస్తున్న బిఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకుందామని, ఇందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పాదయాత్రలో భువనగిరి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కల్లూరు రామచంద్రారెడ్డి, కుడుదుల నగేష్, బీర్ల ఐలయ్య యాదవ్, బండ్రు శోభ తదితరులు పాల్గొన్నారు.