Site icon vidhaatha

Yamuna | తాజ్ మ‌హ‌ల్‌ను తాకిన య‌మునా నీరు.. 45 ఏండ్ల‌లో ఇదే తొలిసారి..

Yamuna | దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు హ‌ర్యానా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రోసారి య‌మునా న‌ది ప్ర‌మాద‌క‌రస్థాయిని మించి ప్ర‌వ‌హిస్తోంది. ఆగ్రాలో య‌మునా న‌ది నీటి మ‌ట్టం 500 అడుగుల‌కు చేరింది. దీంతో చారిత్ర‌క క‌ట్ట‌డం తాజ్‌మ‌హ‌ల్ గోడ‌ల‌ను య‌మునా నీరు తాకింది. తాజ్ వెనుకాల ఉన్న ఉద్యాన‌వ‌నం పూర్తిగా నీట మునిగిపోయింది. తాజ్‌మ‌హ‌ల్ బేస్‌మెంట్‌లోని 22 గ‌దుల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. 1978లో వ‌ర‌దలు వ‌చ్చిన స‌మ‌యంలో య‌మునా తాజ్ మ‌హ‌ల్‌ను తాక‌గా, మ‌ళ్లీ 45 ఏండ్ల త‌ర్వాత తాజ్‌ను య‌మునా తాకింది.

తాజా వ‌ర‌ద‌ల వ‌ల్ల తాజ్ మ‌హ‌ల్‌కు ఎలాంటి ముప్పు లేద‌ని ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా స్ప‌ష్టం చేసింది. రెడ్ ఫోర్ట్, సుప్రీంకోర్టును కొద్ది రోజుల క్రితం య‌మునా నీరు తాకిన విష‌యం తెలిసిందే. మరోవైపు ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా వరద నీరు చేరింది.

కేంద్ర జ‌ల క‌మిష‌న్ స‌మాచారం ప్ర‌కారం.. బుధ‌వారం ఉద‌యం 8 గంట స‌మ‌యానికి ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వ‌ద్ద య‌మునా నీటి మ‌ట్టం 205.48 మీట‌ర్లుగా న‌మోదైంది. బుధ‌వారం సాయంత్రానికి న‌ది నీటిమ‌ట్టం 205.72 మీట‌ర్ల‌ను చేరే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. గ‌త‌వారం య‌మునా న‌ది నీటిమ‌ట్టం ఆల్ టైం గ‌రిష్టానికి చేరి 208.66 మీట‌ర్లుగా న‌మోదు కావ‌డంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వ‌ర‌దలు సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version