Site icon vidhaatha

YCP | ముద్రగడకు YCP పుల్ సపోర్ట్.. పవన్‌పై ఎదురు దాడి

YCP |

విధాత‌: ఈస్ట్ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మీద చేసిన కామెంట్స్ ఆంధ్రలో మంటలు రేపాయి. కాపు ఉద్యమాన్ని ఎవరి వద్దా తాకట్టు పెట్టవద్దని, జగన్ సీఎంగా ఉన్నపుడు ఉద్యమాలు చేయక్కర్లేదా అని అన్యాపదేశంగా ముద్రగడ పద్మనాభంను ఉద్దేశించి పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

దానికి ప్రతిగా ఇప్పటికే ముద్రగడ పద్మ నాభం ఓ పెద్ద లెటర్ ద్వారా పవన్ మీద విరుచుకు పడగా ఇప్పుడు ఆయనకు తోడుగా వైసిపి నాయకులు మీడియా ముందుకు వచ్చారు. తాను ఎన్నడూ ఎవరి ముందూ మోకరిల్లి దేహి అనలేదని, ఏనాడూ డబ్బులు కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టలేదని ముద్రగడ లేఖలో పవన్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతేకాకుండా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి నీ సంకెళ్లు వేసి బట్టలు ఊడదీసి కొట్టుకుంటూ వెళ్తాం అని పవన్ చేసిన ప్రకటనను సైతం ముద్రగడ ఖండించారు. రాజకీయ నాయకులు మాట్లాడే భాష అది కాదు అని చెబుతూ ఇప్పటి వరకు ఎంత మందిని అలా కొట్టారు.. ఎంతమందికి సంకెళ్లు వేశారు చెప్పాలని ప్రశ్నించారు.

ఇక ఇప్పుడు ముద్రగడకు అనుకూలంగా వైసిపి కాపు నాయకులు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా, వంగా గీత, కురసాల కన్నబాబు వంటివారిని వంతుల వారీగా మీడియా ముందుకు దించిన వైసిపి పవన్ కళ్యాణ్ మీద గట్టిగా ఎదురుదాడి చేస్తోంది. పవన్ ను చంద్రబాబు దత్త పుత్రుడిగా చెబుతూ ప్యాకేజీ కోసం ఇలా వీధుల్లోకి వచ్చి ఎగిరితే ఎవరూ లెక్క చేయరు అని వైసిపి నాయకులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

పవన్ లో రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కుప్పిగెంతులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్రకు గోదావరి జిల్లాల్లో ఊపు కనిపిస్తోంది. యువత హుషారుగా ఆయన వెంట నడుస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన చేస్తున్న కామెంట్స్, ప్రకటనలు వారిలో జోష్ నింపుతున్నాయి. గోదావరి జిల్లాల్లో తన పట్టును రుజువు చేసుకునేందుకు పవన్ గట్టిగానే ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుండగా ప్రభుత్వం, వైసిపి నాయకులు ఆయన్ను ఎక్కడికక్కడ నిలువరిస్తూ విమర్శల దాడిని పెంచుతున్నారు.

Exit mobile version