విధాత: పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పెన్షన్‌తో ఆనందదాయక జీవితం గడపాలని చాలామందే కలలు కంటారు. అయితే అందరికీ ఆ అవకాశం ఉండదు. కానీ అదే రీతిలో నమ్మకమైన, భద్రమైన పెన్షన్‌ను కొన్ని పథకాల్లో పెట్టుబడి ద్వారా పొందవచ్చు.
అలాంటి వాటిలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (scss), పోస్టాఫీస్ నెలసరి ఆదాయ పథకం (mis) ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రెండు స్కీంలకున్న పెట్టుబడి పరిమితిని రెట్టింపు చేశారు.
ఎస్‌సీఎస్ఎస్‌లో పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి 30 లక్షలకు, ఎంఐఎస్‌లో రూ.4.5 లక్షల నుంచి 9 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. దీంతో ఇప్పడు వస్తున్న ఆదాయానికి రెట్టింపు ఆదాయం సురక్షిత మార్గంలో పొందవచ్చన్న మాట. ఇక ఈ స్కీంలలో వడ్డీ రేటు మూడు నెలలకోసారి మారుతుంది.
అయితే పెట్టుబడి పెట్టే సమయంలో ఉన్నప్పటి వడ్డీరేటే ఐదేండ్లపాటు లాక్ అవుతుంది. ఆ రేటు ప్రకారమే మీ రాబడులుంటాయి. ఇక వీటిలో త్రైమాసిక చెల్లింపులే ఉంటాయి. రూ.15 లక్షల పెట్టుబడిపై నెలకు రూ.10,000 చొప్పున వస్తాయి. అలాగే ఎంఐఎస్‌లో రూ.4.5 లక్షల పెట్టుబడికి నెలనెలా రూ.2,662.5 ఆదాయం అందుకోవచ్చు.