Site icon vidhaatha

New Scam | డ‌బ్బులు పంపుతా.. బంగారు చైన్లు పార్సిల్ చేయమని..!

New Scam |

విధాత‌: సైబ‌ర్ నేర‌గాళ్ల క‌న్ను వ్యాపార‌స్థులపై ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఓటీపీల ద్వారా, త‌ప్పుడు లింక్‌ల ద్వారా సొమ్ము దోచుకున్న ఘ‌ట‌నలు న‌మోదు కాగా.. దిల్లీలో కొత్త త‌ర‌హా మోసం (Cyber Crime) వెలుగులోకి వ‌చ్చింది. డ‌బ్బులు పంపుతాన‌ని.. బంగారు చైన్‌ల‌ను తాను పంపిన అడ్ర‌స్‌ల‌కు పార్సిల్ చేయాల‌ని ఒక బంగారు వ్యాపారికి ఫోన్ వ‌చ్చింది. చెప్పిన ప్ర‌కారం అత‌డు డ‌బ్బులు పంపిన‌ట్లు మెసేజ్ కూడా వ‌చ్చింది. దీంతో అనుకున్న ప్ర‌కారం.. చైన్‌ల‌ను వారు చెప్పిన చోట‌కు పంపేశారు.

అలానే రెండో సారీ చేశారు. అస‌లు త‌న ఖాతాలో ఏ సొమ్మూ జ‌మ కాలేద‌ని.. ఇదంతా మోస‌మ‌ని గ్ర‌హించేట‌ప్ప‌టికీ స‌ద‌రు వ్యాపారి రూ.3 ల‌క్ష‌ల స‌ర‌కును అత‌డికి స‌మ‌ర్పించుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే బాధితుడు నావ‌ల్ కిషోర్ కుటుంబం .. దిల్లీలోని ప్ర‌తిష్ఠాత్మ‌క చాందినీ చౌక్‌లో ఐదు ద‌శాబ్దాలుగా బంగారు దుకాణాన్ని నిర్వ‌హిస్తోంది. అత‌డు గ‌త వారం ఒక ఆధ్యాత్మిక‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అయోధ్య‌కు వెళ్లాడు.

ఈ క్ర‌మంలో ఒక వ్య‌క్తి అత‌డికి ఫోన్ చేసి త‌న‌కు 15 గ్రాముల బంగారు చైన్ కావాల‌ని అడిగాడు. దిల్లీలోని దుకాణానికి తాను రాలేన‌ని.. ఎంతైతే అంత నెట్‌లో పంపుతాన‌ని చెప్పి ఖాతా వివ‌రాలు తీసుకున్నాడు. ఆ చైన్‌ను చెప్పిన అడ్ర‌స్‌కు పంపేయాల‌ని తెలిపాడు. స‌రేన‌న్న కిషోర్‌కు కొద్ది సేప‌టికే రూ.93,400 త‌న ఖాతాకు జ‌మైన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. దీంతో ఆ స్క్రీన్ షాట్‌ను దుకాణంలో ఉన్న త‌న కొడుకుల‌కు పంప‌డం.. వారు ఆ చైన్‌ను స‌ద‌రు వ్య‌క్తి అడ్ర‌స్‌కు పంప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

దీంతో త‌న ప‌థ‌కం పారింద‌ని భావించిన దుండ‌గుడు ఆ రోజే మ‌రో సారి కిషోర్‌కు ఫోన్ చేసి ఈ సారి 30 గ్రాముల చైన్ కావాల‌ని అడిగాడు. దీనికి రూ.1,95,400 అవుతుంద‌న‌డంతో.. అంత మొత్త‌మూ త‌న ఖాతాకు జ‌మైన‌ట్లు కిషోర్‌కు మెసేజ్ వ‌చ్చింది.

ముందు జ‌రిగిన త‌ర‌హాలో స్క్రీన్‌షాట్ దుకాణానికి పంప‌డం.. వారు ఆ చైన్‌ను స‌ద‌రు అడ్ర‌స్‌కు పంప‌డం జ‌రిగిపోయాయి. ఇలా వ‌రుస‌గా ఒక వ్య‌క్తి చైన్‌లు ఆర్డర్ ఇవ్వ‌డంతో కించిత్ అనుమానానికి గురైన కిషోర్‌.. రెండో ఘ‌ట‌న త‌ర్వాత తన బ్యాంక్ యాప్‌లో స్టేట్‌మెంట్ చెక్ చేశాడు. అస‌లు ఈ చైన్‌లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాక‌పోవ‌డంతో
కంగుతిన్నాడు.

త‌న కుమారుల‌ను బ్యాంక్‌కు పంపి చెక్ చేయించినా .. వారూ ఆ సొమ్ము రాలేద‌నే చెప్పార‌ని తెలిపాడు. దీనికి తామేం చేయలేమ‌ని బ్యాంక్ అధికారులు చేతులెత్తేసిన‌ట్లు కిషోర్ పేర్కొన్నార‌న్నారు. తామైతే బ్యాంక్ యాప్‌లో చెక్ చేసుకునే.. స‌ర‌కు ఇచ్చేవార‌మ‌ని.. ఆ యాప్ త‌మ తండ్రి ఫోన్‌లో ఉండి పోవ‌డంతో ఈ మోసం జ‌రిగింద‌ని కిషోర్ కుమారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం సైబ‌ర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన కిషోర్‌.. ఈ మోసం దేశ‌వ్యాప్తంగా జ‌రిగే అవ‌కాశం ఉన్నందున న‌మోదైన అన్ని బంగారు దుకాణాల సంఘాల‌కు ఈ స‌మాచారం ఇచ్చాన‌ని తెలిపారు.

Exit mobile version