Site icon vidhaatha

YS Jagan | కోటి దాటిన మిస్డ్ కాల్స్!! YCP భారీ ప్రచార కార్యక్రమం ‘మా నమ్మకం నువ్వే జగన్’

YS Jagan

విధాత‌: విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల బాగు కోసమే పని చేస్తున్నాం అని చెబుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్(YS Jagan) చేపట్టిన భారీ క్యాంపెయిన్ కార్యక్రమం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.

రెండు వారాల క్రితం మొదలు పెట్టిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ లో భాగంగా వైసిపి కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ప్రభుత్వ పరంగా ఆయా కుటుంబాలకు ఎంత మేరకు లబ్ధి చేకూరిందో వివరిస్తూ ఆ ఇంటి గోడకు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ పోస్టర్ అతికిస్తున్నారు.

అంతే కాకుండా తాము జగన్ పాలన పట్ల, సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లయితే ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ ఒక మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు. అయితే ఈ నంబరుకు ఈ రెండు వారాల్లో కోటికి పైగా మిస్డ్ కాల్స్ వచ్చినట్లు వైసిపి చెబుతోంది.

దాదాపు అరవై లక్షల కుటుంబాలను తమ క్యాడర్, గృహ సారథులు, వాలంటీర్స్ కలుస్తారని, తమ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎంత చేసింది.. ఏమేం చేసింది ప్రతి ఇంటికి వచ్చి వివరిస్తారని పార్టీ చెప్పడమే కాకుండా అదంతా పక్కాగా జరిగేలా పార్టీ అధిష్టానం పర్యవేక్షించింది. ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని చెప్పేందుకే అన్నట్లుగా ఊరూరా.. ఇంటింటికీ ఈ కార్యక్రమం చేపట్టారు.

గతంలో చేసిన గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమానికి కొనసాగింపుగా దీన్ని చేపట్టిన పార్టీ, ప్రభుత్వం మొత్తానికి కోటి దాటిన మిస్డ్ కాల్స్ చూసి సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ మిస్డ్ కాల్స్ అన్నీ ఓట్లుగా మారతాయా.. అన్నది పక్కనబెడితే కార్యక్రమం మాత్రం విజయవంతం అయినట్లు లెక్క.

మరోవైపు టిడిపి మాత్రం ఈ పోస్టర్, స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని వ్యతిరేకించింది. ప్రజల ఇళ్లకు వైసిపి పోస్టర్స్ ఎందుకు అని విమర్శించింది. అసలు వైసిపి వాళ్ళను ఇళ్లకు రానివ్వద్దని పిలుపును ఇచ్చింది. ఏదీ ఏమైనా గానీ కోటి మిస్డ్ కాల్స్ సాధించామని వైసిపి సంబర పడుతోంది.

Exit mobile version