Sitting jobs : ఈ కంప్యూటర్ కాలంలో గంటల తరబడి ఉద్యోగాలు చేసేవారి సంఖ్య పెరిగింది. అందరూ కూర్చుని చేసే ఉద్యోగం హాయిగా ఉంటుంది అంటుంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కూర్చోవడంవల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగవని, దాంతో అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల లాంటి వస్తాయని చెబుతున్నారు. అలాంటి అనారోగ్యాల బారినపడకూదన్నా, ఉన్న అనారోగ్య సమస్యలు పెరగకూడదన్నా సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యమధ్యలో లేచి నడవడం
సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్లు మధ్యమధ్యలో గంటలకు ఒకసారైనా లేచి అటూఇటూ నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నడవడంవల్ల రక్తప్రసరణ సాఫీగా సాగి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. గంటల తరబడి కూర్చోవడం మద్యపానం, ధూమపానం కంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవగడియారం లయతప్పి బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
నిత్య వ్యాయామం
గంటల తరబడి ఒకేచోట కూర్చొని పని చేయడంవల్ల ఊబకాయం వస్తుంది. పొట్ట పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దాంతో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చి అకాల మరణం సంభవించే ప్రమాదం ఉందని నిఫుణులు చెబుతున్నారు. కొంతమంది కూర్చున్న చోటే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటివి జరగకూదంటే నిత్య వ్యాయామం అవసరమని సూచిస్తున్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలంటున్నారు.
కంటినిండా నిద్ర
గంటల తరబడి కూర్చుని పనిచేసేవాళ్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరగదు. అంతేగాక గంటలకొద్ది కంప్యూటర్ స్క్రీన్ చూడటంవల్ల కండ్లపై కూడా బాగా ఒత్తిడి పడుతుంది. దాంతో రకరకాల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు రావద్దంటే రోజూ కంటినిండా నిద్ర అవసరం. నిద్ర బాగా అలసిపోయిన మెదడు తిరిగి శక్తిని పుంజుకుంటుంది. దాంతో జీవక్రియలు సజావుగా సాగుతాయి. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.