Honey vs Sugar | ఆరోగ్యం( Health ) పట్ల దృష్టి ఉన్న వారు.. ఆహార పదార్థాలను( Food Items ) కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటారు. ఈ ఆహార పదార్థాలను మాత్రమే భుజించి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సరిపోలిన ఆహార పదార్థాల్లో ఏది మంచిదో తేల్చుకోలేకపోతాం. అలాంటి వాటి జాబితాలో తేనే, చక్కెర ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెటరో తెలుసుకోలేక సతమతమవుతుంటాం. తేనే( Honey ), చక్కెర( Sugar ) రెండు తీపి పదార్థాలే. అయినా తేనే ఆరోగ్యకరమైన తీపి పదార్థం అనే నమ్మకం ఏర్పడిపోయింది. దీంట్లో నిజమెంత..? చక్కెర బదులు తేనె వాడకం ఆరోగ్యకరమా..? అనే విషయాలను తెలుసుకుందాం.
తేనె, చక్కెర రెండు కూడా తీపి పదార్థాలే. వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లే వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి. తేనెలో 40 శాతం ఫ్రక్టోజ్, 30 శాతం గ్లూకోజ్ ఉంటుంది. అదే చక్కెరలో 50 శాతం ఫ్రక్టోజ్, 50 శాతం గ్లూకోజ్ ఉంటాయి. అయితే ఫ్రక్టోజ్ కాలేయం సహాయంతో మెటబలైజ్ అయి ఊబకాయం, కాలేయ కొవ్వు, మధుమేహా వ్యాధులకు దారి తీస్తుంది. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ రెండూ శరీరంలోకి చేరుకున్న వెంటనే జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
చక్కెర కంటే తేనె మేలు..!
ఈ క్రమంలో చక్కెర కంటే తేనె మేలు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చక్కెరలో లేని నీరు, పూల పుప్పొడి, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజ లవణాలు తేనెలో ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక తేనెతో పోల్చితే చక్కెరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిని క్షణాల్లో పెంచేస్తుంది. ఇందుకు కారణం తేనెలో ఉండే ఖనిజ లవణాలు చక్కెరలో లేకపోవడమే. ఇక తేనె చక్కెరకు మించిన కేలరీలను శరీరానికి అందిస్తుంది. ఒక టీ స్పూన్ చక్కెరలో 49 కేలరీలు ఉంటే, అంతే తేనెలో 64 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి తీపి అయినా అనర్ధదాయకమనే విషయాన్ని గ్రహించి తగు మోతాదులో తీసుకోవడం బెటర్.
