Cancer Breakthrough | తేనెతుట్టెను కదపాలంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఒక్కసారి తేనెటీగ కుట్టిందంటే మంట మామూలుగా ఉండదు. తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే విషం ప్రభావం అది. కానీ.. ఇప్పుడు అదే తేనెటీగ విషం.. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే బ్రెస్ట్ క్యాన్సర్‌పై పోరాటంలో కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తేనెటీగ విషం.. ప్రయోగశాలలో అత్యంత దూకుడును ప్రదర్శించే కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను విజయవంతంగా నాశనం చేసినట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది ప్రారంభ దశ పరిశోధన మాత్రమే. ఇది మెరుగైన వైద్య చికిత్సగా మారేందుకు మరిన్ని లోతైన అధ్యయనాలు, ప్రయోగాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చికిత్స చేయడం కూడా కష్టతరమైన రెండు రకాల బ్రెస్ట్ క్యాన్సర్లు.. ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, హెచ్‌ఈఆర్2 (HER2) ఎన్‌రిచ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్‌లపై నిపుణులు దృష్టిసారించారు. ఈ రెండింటిపైనా తేనెటీగ విషం, అందులోని మెలిట్టన్ అనే పదార్థం గణనీయ ప్రభావం చూపినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ‘తేనెటీగ విషం, అందులోని మెలిట్టిన్.. ట్రిపుల్ నెగెటివ్, HER2 ఎన్‌రిచ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాల జీవన సామర్థ్యాన్ని వేగంగా, స్పష్టంగా ఎంపిక చేసుకుని, తగ్గించాయి’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సియారా డఫీ వివరించారు.
ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ నిర్వహించింది. దాని ఫలితాలు ప్రముఖ సైన్స్ జనరల్.. ‘నేచర్ ప్రిసిషన్ ఆంకాలజీ’లో పబ్లిష్ అయ్యాయి.
ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల నుంచి 312 తేనెటీగలు, బంబుల్ బీల నుంచి తీసిన విషాన్ని శాస్త్రవేత్తలు.. వివిధ రకాల బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై ప్రయోగించారు. ఒక నిర్దిష్టమోతాదులో ఈ విషం.. ఒక గంట వ్యవధిలోనే క్యాన్సర్ కణాలను నాశనం చేసింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలకు చాలా తక్కువ నష్టం సంభవించింది. అయితే.. విషం మోతాదు మించిన సమయంలో ఆరోగ్యకర కణాలపైనా దుష్ప్రభావం కనిపించింది.
కీలక పాత్రధారి.. మెలిట్టిన్
తేనెటీగ విషంలో మెలిట్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదే క్యాన్సర్ నిరోధక ప్రభావంలో కీలక పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో విషయం ఏమిటంటే.. ఈ మెలిట్టిన్‌ను తేనెటీగ విషం నుంచే కాదు.. కృత్రిమంగా (సింథటిక్) కూడా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘తేనెటీగ విషంలో ఉండే చిన్న, పాజిటివ్ చార్జ్ కలిగిన మెలిట్టిన్‌ను మేం కృత్రిమంగా తయరుచేసి, పరీక్షించాం. క్యాన్సర్ నిరోధక ఎఫెక్ట్‌లో అధిక భాగం ప్రభావం మెలిట్టిన్‌దేనని తేలింది’ అని డాక్టర్ సియారా డఫీ చెప్పారు.
ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే?
క్యాన్సర్ రకాల్లో అత్యంత దూకుడుగా ఉంటుంది ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. దీనికి ప్రస్తుతం శస్త్రచికిత్స, రేడియో థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలే ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి. మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో ఇది సుమారు పది నుంచి పదిహేను శాతం మధ్య ఉంటుంది.
తాజాగా తేనెటీగల విషంతో చేసిన ప్రయోగాల ఫలితాలు ఆశాజనకంగా, ఉత్సాహభరితంగా ఉన్నప్పటికీ.. ఇవి ఇంకా ప్రయోగశాల స్థాయిలోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవుల క్యాన్సర్ చికిత్సలో దీనిని ఉపయోగించేందుకు ముందు ముందు మరిన్ని పరిశోధనలు, విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ అవసరమని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రకృతిలో చిన్న జీవి అయిన తేనెటీగ నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద రోగంగా భావించే క్యాన్సర్‌పై పోరాటానికి కొత్త దారి కనిపించడం శాస్త్రవేత్తలకు, వైద్యరంగానికి పెద్ద ఆశను రేకెత్తిస్తున్నది.
ఇవి చదివారా?
TAR-200 Revolutionary Cancer Treatment | క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మైలురాయి.. మూడు నెలల్లోనే రోగం మాయం!
Russia Cancer Vaccine| క్యాన్సర్ రోగులకు శుభవార్త.. వందశాతం సమర్థతతో వ్యాక్సిన్ రెడీ!
Cancer In India | భారత్‌లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పుట..! పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు..!
