Screen Time | ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్.. ఒకటా పదా.. వేల సంఖ్యలో సామాజిక మాధ్యమాలు గుప్పించే రీల్స్ చూస్తూ.. అబ్బో వీళ్లంతా మనకు ఎంత వినోదం పంచుతున్నారో.. అని అబగా వాటిని చాలా మంది చూసేస్తుంటారు. మెట్రోల్లో, బస్సుల్లో, ఆఫీసులలో ఎంతో మంది తల దించుకుని, మొబైల్‌కు ముఖాన్ని అతికించేసుకున్నారా? అని డౌటనుమానాలు వచ్చేంతగా ఏదో దీక్ష పట్టినట్టు రీల్స్ స్క్రోల్ చేసేస్తూ ఉంటారు! అయితే.. ఆ పేరుతో మీ అత్యంత విలువైన సమయాన్ని వారు దోచేస్తున్నారని మీకు తెలుసా? మిమ్మల్ని రీల్స్‌లో మడతేసి.. వాటిని తయారు చేసేవాళ్లు మాత్రం అందినకాడికి దండుకుంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మీకు తెలుసా? గంటలకొద్దీ మొబైల్స్ రీళ్లతో గడిపేవాళ్ల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లుతుందని మీరెప్పుడైనా ఊహించారా?
పొరుగు విషయాలపై ఎనలేని ఆసక్తి!
‘ప్రతి మనిషికీ తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న తపన ఉంటుంది.. అది సహజం..’ అంటూ మన్మథుడు అనే సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం చెబుతాడు. అలానే ఎవరి జీవితాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకునేందుకు, ఎవరు ఏం చేస్తున్నారో గమనించేందుకు సైతం ఇప్పుడు రీల్స్ తెగ ఉపయోగపడుతున్నాయి. చిన్న చిన్న రీల్స్.. ఎందుకూ పనికిరాని వైరల్ వీడియోలు పది పదిహేను సెకండ్లతో తయారయ్యేవి.. వీక్షకుల గంటలకొద్దీ సమయాన్ని ఊడ్చేస్తున్నాయి. దీనిపై ఒక ఆసక్తికర అధ్యయనం ఒకటి భారతీయులు రీల్స్‌కు ఎంతగా ప్రభావితమవుతున్నారో విస్మయం కల్గించే వాస్తవాలను బయటపెట్టింది. ఇంటర్నెట్ విప్లవంతో ఈ కామర్స్ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫారాలు ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న తీరును అది పూసగుచ్చింది.
దాని అంచనా ప్రకారం.. 2024లో స్మార్ట్‌ఫోన్‌ల వీక్షణకు భారతీయులు అంతాకలిసి వెచ్చించిన సమయం అక్షరాల లక్షా పది కోట్ల గంటలు! ఈ వివరాలను మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ ఈవై వెల్లడించింది. సగటున భారతీయులు 5 గంటలపాటు మొబైల్ వీక్షణలో గడుపుతున్నారట. విజ్ఞానం సంపాదించేందుకు, విద్యాపరమైన, వైజ్ఞానిక అంశాలను సెర్చ్ చేసేవారు మినహాయింపు. చూసే ఆ ఐదు గంటల్లోనూ 70శాతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో వచ్చే రీల్స్, ఆన్‌లైన్ గేమ్స్, వీడియోలు చూడటానికే సరిపోతున్నదట. 2024 మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్‌లో ఒక్క డిజిటల్ చానళ్లే 2.5 లక్షల కోట్ల రూపాయలను వెనకేసుకున్నాయి. అంటే.. మనం సమయాన్ని వేస్ట్ చేసుకునే అవకాశం మనకు కల్పించినందుకు మనం వారికి సమర్పించుకుంటున్న సొమ్ము ఇదీ! గతంలో టెలివిజన్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము వెళ్లేది. ఈసారి దానిని సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పక్కకు నెట్టేశాయి.
మొబైల్స్‌తో గడిపే దేశాల్లో మన స్థానం..
స్క్రీన్‌టైమ్ ఎక్కువ స్పెండ్ చేస్తున్న దేశాల్లో ఇండోనేషియా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉంటే.. ఆ మూడో స్థానం మరెవరిదో కాదు.. మనదే. ఇవన్నీ మన పనిగంటలే. వృథా అవుతున్న ఈ పనిగంటలు.. ఇప్పుడు ఓ పెద్ద మార్కెట్. ఆ మార్కెట్‌పై పట్టుకోసం మెటా, అమెజాన్ మొదలు.. ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్ వంటి వ్యాపారవేత్తలు పోటీపడుతున్నారు. భారతదేశంలో 40 శాతం జనాభా అంటే.. సుమారు 56 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని అంచనా. ఇది అమెరికా, మెక్సికో ఈ రెండు దేశాల జనాభా మొత్తానికి సమానం. ఇంత మంది మన దేశంలో మొబైల్స్ వాడుతున్నారన్నమాట. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ఈ వార్తను కూడా మీరు మీ మొబైల్‌లోనే చదువుతున్నారేమో!
కంటెంట్ క్రియేటర్లు, రాజకీయ నాయకులకే లబ్ధి
భారతీయులు తమ స్మార్ట్ ఫోన్లతో బిజీగా ఉండగా.. లక్షల మంది కంటెంట్ క్రియేటర్లు పనీపాటా లేకుండా పనికిమాలిన రీల్స్, వ్లోగ్స్‌తో ఈజీగా బ్యాంకుల్లో డిపాజిట్లు పెంచుకుంటున్నారు. వీళ్లు చేసే కొన్ని రీల్స్ ఎలా ఉంటాయంటే.. పండ్లు తోముకోవడం గురించి కూడా ఒకడు రీల్ చేస్తాడు. ఇంకొకడు లుంగీ ఎలా కట్టుకోవాలో ఉపదేశాలు చేస్తాడు! శుక్రవారం పొద్దున లేవగానే ఏం చేయాలి? గురువారం మధ్యాహ్నం చేయాల్సిన పనులేంటి? ఇలా ఒకటా రెండా.. పనికిమాలిన రీల్స్ మొబైల్ ప్లాట్‌ఫారాల్లో గుప్పుగుప్పుమంటున్నాయి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి కారకులెవరు? దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇలా నాశనమైపోతున్నది? ఎందుకు రెండు మతాల మధ్య విద్వేషాలు రగులుతున్నాయి? వాటితో లాభపడేది ఎవరు? అనే అంశాలపై విశ్లేషించేవారు ఉన్నా.. ఈ చెత్త కంటెంట్ క్రియేటర్లతో పోల్చితే వారు ఎంమాత్రం లెక్కలోకి రారు. ప్రత్యేకించి యువత ఈ చెత్త రీల్స్ ప్రభావంలో చిక్కుకుపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
సోషల్ మీడియా టీమ్‌ల పేరిట చీకటి వ్యవస్థ
మరో అంశం ఏమిటంటే.. ఇటువంటి చెత్త రీల్స్, సున్నిత అంశాలను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరిట ఒక చీకటి వ్యవస్థే నడుస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకు వివిధ రాజకీయ పార్టీలే కాదు.. కొన్ని సంస్థలు సైతం తమ ప్రత్యర్థులపై బురదజల్లేందుకు సొంతగా సోషల్ మీడియా టీమ్‌లను మెయింటెన్ చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల పేరిట ప్రజలు బయటకు వెళ్లి కొనుగోలు చేసుకోలేని పరిస్థితికి తీసుకొస్తున్నాయి. గోరటి వెంకన్న ఒక పాటలో.. అద్దాల అంగడి మాయ.. నువు కొననిది కొనిపిస్తది నీకు తిమ్మిరినెక్కిస్తది.. చెప్పినట్టు.. మాయాప్రపంచంలోకి లాక్కెళ్లిపోతున్నాయి. మనకు అవసరం లేనివాటిని సైతం కొనిపిస్తున్నాయి. దీంతో వీధిలో దుకాణదారులు దెబ్బతినిపోతున్నారు.
ప్రతిదీ పది నిమిషాల్లోనే ఇంటికి తెచ్చిపెట్టే యాప్స్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వీటిలోనూ మల్టీనేషనల్ కంపెనీలే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. బై నౌ! ది షాపింగ్ కాన్‌స్పిరసీ అని నెట్‌ఫ్లిక్స్‌లో ఒక డాక్యుమెంటరీ.. కార్పొరేట్ శక్తులు వినియోగదారులను అవసరం లేకుండా ఎలా కొనిపిస్తాయో కళ్లకు కడుతుంది. తీరా అనేక వస్తువులు కొన్న తర్వాత వాటితో పెద్దగా ఉపయోగం కూడా రాదు. ఒకప్పుడు పుస్తకాలను దూరం చేసి, ఈడియట్ బాక్స్‌గా పేరుగాంచిన టీవీలను సైతం ఈ మోబైల్ ఫోన్స్ ఊడ్చిపారేశాయి. మీరు ఏది వెతికితే.. వరుసబెట్టి మీ హోం పేజీలో అవే యాడ్స్ కనిపిస్తుంటాయి. పరిమితిలో దేనిని వాడినా దానికి విలువ ఉంటుంది. యూజర్ తన పరిమితిని దాటేసి.. వాటిని యూజ్ చేయించేవాడు పరిమితిని దాటేస్తే..? ఏముంది.. వాడు నాలుగు చెత్త రీల్స్ చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుంటాడు.. మనం మన సమయాన్ని వృథా చేసుకుని.. వాటిని చూసి సంబరపడతాం. ఈ పరిస్థితి మారుతుందా?