Site icon vidhaatha

Meta | ఫేస్‌బుక్‌లో AI చాట్‌బాట్ ఫీచర్.. త్వరలో అందుబాటులోకి

Meta | AI Chatbot

విధాత‌: ప్ర‌స్తుత యువ‌త ఫేస్‌బుక్‌ (Facebook)కు దూర‌మ‌వుతున్న నేప‌థ్యంలో వారిని ఆక‌ర్శించ‌డానికి దాని మాతృ సంస్థ మెటా మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే ఏఐ చాట్‌బోట్ల‌ (Chatbots)ను ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉంచ‌నున్నామ‌ని ప్ర‌క‌టించింది. వీటితో రోజు వారీ ఘ‌ట‌నల ద‌గ్గ‌ర నుంచి అంత‌ర్జాతీయ వ్య‌వహారాలు, సైన్యం, సిద్ధాంతాలు ఇలా ఏమైనా మాట్లాడొచ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు అబ్ర‌హం లింక‌న్ అనే ఏఐ చాట్‌బాట్‌తో యూజ‌ర్లు చాట్ చేస్తే బానిస‌త్వం అంటే ఏమిటి? దానిని ఎలా నివారించాలి? అనే విష‌యాల గురించి మ‌న‌తో సంభాషిస్తుంది. అదే ఒక ట్రావెల్ ఏజెంట్ చాట్‌బాట్‌తో మాట్లాడుతూ మ‌నం ఏఏ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల ప‌ట్ల ఆస‌క్తిక‌రంగా ఉన్నామో చెబితే.. ఆ స‌మాచారాన్ని పూర్తిగా క‌స్ట‌మైజ్ చేసి మ‌న‌కు అందిస్తుంది.

ఈ చాట్‌బాట్‌ల ఏర్పాటుకు అనుగుణంగా మెటా ఇప్ప‌టికే లామా2 అనే లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఇది యూజ‌ర్ ప్ర‌శ్న‌ల‌ను నిర్దిష్టంగా అర్థం చేసుకుని.. అందుకు త‌గ్గ స‌మాధానాన్ని ఇచ్చేలా చాట్‌బాట్‌కు సాయం చేస్తుంది.

అయితే ఈ ఆలోచ‌న నిజంగా యువ‌త‌ను ఫేస్‌బుక్ వైపు ఆక‌ర్షితుల‌య్యేలా చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇప్ప‌టి త‌రం యువ‌త అంతా ఇన్‌స్టా (Instagram) టిక్‌టాక్ వైపు వెళ్లిపోయిన నేప‌థ్యంలో వారు మ‌ళ్లీ ఫేస్‌బుక్ వైపు రావ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

గోప్య‌త‌కు భంగ‌క‌ర‌మా?

యూజ‌ర్‌ల స‌మాచారాన్ని సుర‌క్షితంగా ఉంచ‌డంలో ఇప్ప‌టికే మెటాపై అనేక ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో మెటా చాట్‌బాట్‌లతో సంభాషించడమంటే మ‌నం ఇంకా ముఖ్య‌మైన వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని(Privacy) పంచుకోవ‌డ‌మే. అంతే కాకుండా ఈ చాట్‌బాట్‌ల వ‌ల్ల త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి జ‌రిగే అవకాశం కూడా ఉంది.

మ‌రోవైపు ఏఐ చాట్‌బాట్‌ల ట్రెండ్ ఇప్పుడు చ‌ల్ల‌బ‌డిపోయింద‌ని నిపుణులు పెద‌వి విరుస్తున్నారు. లార్జ్ లాంగ్వేజ్ మోడ‌ల్స్ ఇక ఎంతో కాలం మ‌నుగ‌డ సాగించ‌లేవ‌ని ఫేస్‌బుక్‌లో ప‌నిచేసే నిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version