social media influencers । సోషల్ మీడియా(social media)లో చాలా సందర్భాల్లో ‘నిపుణులు’ (experts) ప్రత్యక్షమవుతుంటారు. ఆరోగ్యం విషయంలో సలహాలు ఇచ్చేస్తుంటారు. ప్రముఖులయితే సరే.. కానీ కొందరు ఇన్‌ఫ్ల్యుయెన్సర్లు(influencers)గా పేరుమోసినవారు సైతం తామేదో ఆ అంశంలో రిసెర్చ్ చేశామన్నట్టు సలహాలు గుప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో తమకు అర్హత లేని అంశాల్లో వ్యాఖ్యలు చేయారాదని సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తేల్చి చెప్పింది. న్యూట్రిషనల్ డ్రింక్ (nutritional drink) కాంప్లాన్ ఉత్పత్తిపై ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇష్టానుసారం వ్యవహరించరాదని పేర్కొన్నది.
ఒక విషయంలో పండితులు (master) కానిదే ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తేల్చి చెప్పింది. ప్రశాంత్ దేశాయ్ అనే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పదిలక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్(Facebook)లో 60వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన డాక్టర్ కాదు, న్యూట్రిషనిస్టు(nutritionist), డైటీషియన్ కూడా కాదు.. అసలు ఆయనకు ఆరోగ్యరంగంతో సంబంధమే లేదని, అయినప్పటికీ ఆయన కాంప్లాన్ వెనుక ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడారని జస్టిస్ సౌరభ్ బెనర్జీ (Justice Saurabh Banerjee) అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సంబంధిత (health-related post) అంశాలపై పోస్టు చేసేవారికి సంబంధిత అర్హతలు ఉండాలని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Advertising Standards Council of India) మార్గదర్శకాలు పేర్కొంటున్నాయని పేర్కొన్నారు. సదరు ఉత్పత్తిని కించపరిచేలా ఎలాంటి అంశాలు పోస్టు చేయరాదని, ప్రస్తుత వీడియోను తన అన్ని సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి రెండు వారాల్లోగా తొలగించాలని ఆదేశించారు.
కాంప్లాన్, దాని తరహా ఇతర ఉత్పత్తుల గురించి దేశాయ్ ఒక వీడియో చేస్తూ.. చిన్న పిల్లలకు రోజువారీ అవసరాలకు మించి చక్కెర (sugar) వాటిలో ఉన్నదని పేర్కొన్నారు. తమ ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రచారం, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ జైడస్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Zydus Wellness Products Ltd) పిటిషన్ దాఖలు చేసింది. తమ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించకుండా, తమ ఉత్పత్తులైన కాంప్లాన్, కాంప్లాన్ బాదం పిస్తా(Complan Pista Badam)లపై తప్పుడు ప్రచారం చేయకుండా దేశాయ్‌ను నిరోధించాలని ఆ పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎవరైనా సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు యథార్థంగా, జాగరూకతతో(cautiously), అనుమతించిన మేరకు వ్యవహరిస్తే వారికి రాజ్యాంగంలోని 19వ అధికరణాన్ని ఆశ్రయించే హక్కు ఉంటుందని పేర్కొంది. కానీ.. ఈ కేసులో కంటెంట్ క్రియేటర్ కాంప్లాన్ ఉత్పత్తిని నేరుగా టార్గెట్ చేసుకుని, ఆ ఉత్పత్తిని వాడొద్దని ప్రజలకు చెప్పడం ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొన్నది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎలాంటి అర్హతలు, ధృవీకరణలు లేకుండా వృత్తిపరమైన నిపుణుల (professional) పాత్ర పోషించరాదని తెలిపింది. ఈ కేసులో ప్రతివాది పోటీదారు లేదా అర్హత పొందిన వైద్యుడు/ న్యూట్రిషనిస్టు/ డైటీషియన్ కాదని, కానీ.. నేరుగా ఫిర్యాదుదారు ఉత్పత్తి కాంప్లాన్‌ను నేరుగాలక్ష్యం చేసుకున్నారని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన తనకు మాట్లాడే అర్హత లేని అంశాలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యం, జీవన విధానాలపై కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసే దేశాయి.. తాను చేసిన వీడియోలో వాస్తవాలే చెప్పానని అంటున్నారు.