Site icon vidhaatha

Indian Attacked Dublin | నెత్తురు కారేలా దాడి చేసి.. వివస్తృడిని చేసి.. ఐర్లాండ్‌లో భారతీయ యువకుడిపై అమానుషం..

Indian Attacked Dublin | ఐర్లాండ్‌లో ఒక భారతీయ యువకుడిపై దారుణ దాడి జరిగింది. డబ్లిన్‌ నగరంలోని టల్లాగ్ట్‌ ప్రాంతంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక మహిళ ఫేస్‌బుక్‌లో తెలియజేశారు. నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆ యువకుడిని ఆమే హాస్పిటల్‌కు తరలించారు. 40 ఏళ్ల ఈ యువకుడు అమెజాన్‌లో పనిచేసేందుకు కొద్ది రోజుల క్రితమే ఐర్లాండ్‌ వచ్చినట్టు తెలుస్తున్నది. దాడి ఉదంతాన్ని ఫేస్‌బుక్‌ పోస్టులో జెన్నిఫర్‌ ముర్రే అనే స్థానిక మహిళ తెలియజేస్తూ.. ‘శనివారం సాయంత్రం నేను డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్నాను. అకస్మాత్తుగా సుమారు 30 మంది ఉన్న గుంపు నన్ను చుట్టుముట్టింది. నేను కారు ఆపి చూడగా.. ఆ గుంపు మధ్యలో ఒక యువకుడు నెత్తుటిమడుగులో పడి ఉన్నాడు. సాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు’ అని తెలిపారు. భారతీయుడైన ఆ వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని చెప్పారు. అతడిని టల్లాగ్ట్‌ ఏరియాలో కొందరు వ్యక్తులు దాడి చేశారని పేర్కొన్నారు. అమెజాన్‌ కంపెనీలో పనిచేసేందుకు మూడు వారాల క్రితమే అతడు ఐర్లాండ్‌కు వచ్చాడు.

‘కొందరు టీనేజర్లు తమను లైంగికంగా వేధించాడని, అందుకే తాము అతడిపై దాడి చేశామని అరుస్తున్నారు. అయితే.. అతను అలా కనిపించలేదని ముర్రే తన వీడియో పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘వాళ్లు అతడి దుస్తులు తొలగించారు. షూస్‌ తీసేశారు. ఆఖరుకు ట్రౌజర్స్‌, అండర్‌వేర్‌ సైతం తొలగించారు. అతడి వాలెట్‌, ఫోన్‌ గుంజుకుని రోడ్డుపై పడేశారు. అతడిని చంపి ఉండేవాళ్లు కూడా’ అని తెలిపారు. తనకు భార్య, 11 నెలల బేబీ ఉన్నట్టు, త్వరలో ఇక్కడికి వచ్చేందుకు వీసాల కోసం ప్రయత్నిస్తున్నారని అతడు చెప్పాడు. ‘నాతో మాట్లాడినంత సేపూ చాలా మర్యాదగా మాట్లాడాడు. అతడు కప్పుకొనేందుకు ఒక బ్లాంకెట్‌ ఇచ్చాను. అతను ఆ పరిస్థితికి చాలా ఎంబరాసింగ్‌కు, షాక్‌కు గురై ఉన్నాడు’ అని ముర్రే ఆవేదనాత్మకంగా చెప్పారు.

ఈ ఘటనకు జాత్యహంకారమే కారణమని ముర్రే చెబుతున్నారు. ది జర్నల్‌ అనే ఐరిష్‌ పత్రికతో ఆమె మాట్లాడుతూ.. ‘జాత్యహంకారం కారణంగా అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయి’ అని చెప్పారు. ‘అతడి నుంచి డబ్బులు, ఫోన్‌ తీసుకుని.. చనిపోయాడో బతికున్నాడో కూడా చూడకుండా వాళ్లు అతడిని అక్కడ వదిలేసి పోయారు’ అని ఆమె తెలిపారు.

Exit mobile version