Post Covid | ఆరోగ్యంపై మహమ్మారి ప్రభావం..! గుండెపోటు కేసులు ఎందుకు పెరిగాయి..? నిపుణులు మాట ఇదీ..!

Post Covid | 2019 సంవత్సరం చివరలో చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం వైరస్‌ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయినా దాని ప్రభావం ఇప్పటికీ జనంలో కనిపిస్తున్నది. పోస్ట్‌ కొవిడ్‌తో ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణులు కొవిడ్‌ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అనేక రకాల ఆరోగ్య సవాళ్లు పెరిగాయని పేర్కొంటున్నారు.

  • Publish Date - April 14, 2024 / 10:30 AM IST

Post Covid | 2019 సంవత్సరం చివరలో చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం వైరస్‌ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయినా దాని ప్రభావం ఇప్పటికీ జనంలో కనిపిస్తున్నది. పోస్ట్‌ కొవిడ్‌తో ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణులు కొవిడ్‌ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అనేక రకాల ఆరోగ్య సవాళ్లు పెరిగాయని పేర్కొంటున్నారు. అనేక అంటువ్యాధుల తీవ్రమైన రూపాలు కనిపిస్తున్నాయని, ఇది ఆరోగ్యరంగంపై భారీగా భారం మోపిందని పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో పెద్ద సంఖ్యలో జనం బ్లాక్‌ ఫంగస్‌, మంకీఫాక్స్‌ బారిపడ్డారు. అయితే మునుపటితో పోలిస్తే ప్రస్తుతం రోగనిరోధక శక్తి సమస్యలు పెరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కరోనా తర్వాత మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యులు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థలో లోపాలు..

కరోనా తర్వాత పెరిగిన ఆరోగ్య సమస్యలపై ఎయిమ్స్ ఢిల్లీలోని పిల్లల విభాగం సర్జన్ డాక్టర్ శిల్పా శర్మ స్పందించారు. కరోనా మహమ్మారి అనేక రకాల ఆరోగ్య సమస్యలను పెంచిందని పేర్కొన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక వ్యవస్థలో లోపాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అందుకే వైరల్ ఇన్‌ఫెక్షన్, స్కిన్ అలర్జీ, కోలిసైస్టిటిస్, అపెండిసైటిస్ తదితర సమస్యలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయన్నారు. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు ఇప్పుడు 3-4 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మహమ్మారి నుంచి గుండె జబ్బుల సమస్యలు కూడా వేగంగా పెరిగాయని డాక్టర్ శిల్ప తెలిపారు. డీహైడ్రేషన్, రక్తం గడ్డకట్టడం పెద్ద ప్రమాదాలని చెప్పారు. జిమ్‌లో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. కరోనా బాధితులుగా మారిన చాలా మందిరలో గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే, ముందుజాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వైద్యలను సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

పోస్ట్‌, లాంగ్‌ కొవిడ్‌తో ముప్పు తప్పదు..

ఇప్పటికే పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్‌తో కలిగే ఆరోగ్య సమస్యలపై అధ్యయనాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నాయి. మార్చి 2020-మార్చి 2022 మధ్య కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల్లో దాదాపు 6శాతం మంది జూలై 2023 నాటికి మరణించారని తమిళనాడు ఆరోగ్య శాఖ ఓ అధ్యయనంలో వెల్లడించింది. దాదాపు 20శాతం మరణాలు 61-80 ఏళ్ల వయస్సులో సంభవించాయని పేర్కొంది. 40 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఒక శాతానికి దగ్గరగా మరణాలు నమోదయ్యయాని పేర్కొంది. ఇది మాత్రమే కాదు, కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు కరోనా ఇన్‌ఫెక్షన్ బాధితుల్లో అనేక రకాల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో వైరస్‌ సోకిన వారిలో 41 శాతం మంది ఆసుపత్రులలో చేరాల్సి వచ్చిందని ఓ అధ్యయనం నివేదిక తెలిపింది. ఇందులో ఎక్కువగా కొమొర్బిడిటీలతో బాధపడుతున్నవారే ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో మధుమేహం (15.5శాతం), అధిక రక్తపోటు (13.6శాతం) బాధితులున్నారు. కరోనా వైరస్ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని అధ్యయన నివేదిక తెలిపింది. దీని కారణంగా తీవ్రమైన సమస్యల కేసులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. మహమ్మారి మాన శరీరంలోని రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.

Latest News