Viagra | వయాగ్రా కేవలం అంగస్తంభన కోసమే కాదు.. అంతకుమించిన ప్రయోజనాలున్నాయ్‌..!

Viagra | సిల్డెనాఫిల్ (Sildenafil) అనే ఔషధం దాని బ్రాండ్ 'వయాగ్రా (Viagra)' పేరుతో బాగా ప్రసిద్ది చెందింది. సాధారణంగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న మగవాళ్లలో చికిత్స కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తుంటారు. కానీ ఈ వయాగ్రాతో అంతకుమించిన ప్రయోజనాలను ఉన్నాయని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వయాగ్రా ఔషధం కేవలం అంగస్తంభనను ప్రేరేపించడానికి మాత్రమేగాక.. మెదడుకు రక్తప్రసరణను పెంచడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపర్చడంలో తోడ్పడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన నూతన అధ్యయనంలో తేలింది.

  • Publish Date - June 13, 2024 / 01:09 PM IST

Viagra : సిల్డెనాఫిల్ (Sildenafil) అనే ఔషధం దాని బ్రాండ్ ‘వయాగ్రా (Viagra)’ పేరుతో బాగా ప్రసిద్ది చెందింది. సాధారణంగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న మగవాళ్లలో చికిత్స కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తుంటారు. కానీ ఈ వయాగ్రాతో అంతకుమించిన ప్రయోజనాలను ఉన్నాయని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ వయాగ్రా ఔషధం కేవలం అంగస్తంభనను ప్రేరేపించడానికి మాత్రమేగాక.. మెదడుకు రక్తప్రసరణను పెంచడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపర్చడంలో తోడ్పడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన నూతన అధ్యయనంలో తేలింది.

రక్తనాళాల పనితీరు దెబ్బతినడం రక్తనాళ సంబంధ చిత్తవైకల్యానికి (Vascular dementia) దారితీస్తుంది. ఈ వాస్క్యులార్‌ డైమెన్సియా అనేది నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర జ్ఞానానికి సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గడంవల్ల మెదడు కణజాలం ప్రభావితమమై క్రమంగా దెబ్బతింటుంది. ఇలా మెదడు కణజాలం దెబ్బతినడంవల్ల రక్తనాళ సంబంధ చిత్తవైకల్యం ఏర్పడుతుంది. వయాగ్రా మెదడుకు రక్తసరఫరాను పెంచి, మెదడు రక్తనాళాల పనితీరును మెరుగుపర్చి, దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ‘సర్క్యులేషన్ రిసెర్చ్ (Circulation Research)’ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం చిత్తవైకల్యానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలకమైన దశను సూచిస్తుంది.

అధ్యయన ఫలితాలు

సిల్డెనాఫిల్‌ ఔషధం మెదడులోని పెద్ద రక్తనాళాలతోపాటు అల్ట్రాసౌండ్‌ (Ultrasound), ఎంఆర్ఐ (MRI) స్కాన్‌లలో మాత్రమే కనిపించే చిన్న రక్తనాళాలకు కూడా రక్తసరఫరాను పెంచుతుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్‌కు రక్త ప్రవాహ ప్రతిస్పందనను పెరుగుతుంది. తద్వారా పెద్దమెదడు రక్తనాళాల (Cerebrovascular) పనితీరును మెరుగుపడుతుంది. అదేవిధంగా సిల్డెనాఫిల్‌ను సిలోస్టాజోల్‌ (Cilostazol) తోపాటు తీసుకుంటే మెదడులోని రక్తనాళాల నిరోధకత తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అయితే సిలోస్టాజోల్‌తో సైడ్ఎఫెక్ట్స్‌ ఉంటాయని, ముఖ్యంగా అతిసారం (Diarrhoea) వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

‘రక్తనాళ సంబంధ చిత్తవైకల్యం ఉన్నవారి మెదడుపై సిల్డెనాఫిల్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది..? ఈ ఔషధం మెదడులోని రక్తనాళాల్లోకి ప్రవేశించి, రక్త ప్రవాహాన్ని ఏవిధంగా మెరుగుపరుస్తుంది..? దానికి రక్తనాళాలు ఎలా ప్రతిస్పందిస్తాయి..? అనేది తెలియజేయడానికి ఇది మొదటి ట్రయల్’ అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని ‘వోల్ఫ్సన్ సెంటర్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్‌ స్ట్రోక్‌ అండ్ డమెన్షియా’లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అలస్టైర్ వెబ్ చెప్పారు. మెదడులోని చిన్న రక్త నాళాలకు దీర్ఘకాలికంగా నష్టం జరగడమనేది రక్తనాళ సంబంధ చిత్తవైకల్యానికి దారితీసే అత్యంత సాధారణ కారణాలలో ఒకటని ఆయన తెలిపారు. రక్తనాళ చిత్తవైకల్యాన్ని నివారించడానికి సరైన ఔషధం కోసం పెద్ద స్థాయిలో పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు.

మూడు వారాల పరిశోధన

వాస్క్యులార్‌ డైమెన్షియాకు ప్రస్తుతం నిర్దిష్ట చికిత్సలు లేవని తాజా అధ్యయనం తెలిపింది. మెదడులోని చిన్న రక్తనాళాలు దీర్ఘకాలికంగా దెబ్బతినడం కేవలం వాస్క్యులార్‌ డైమెన్షియాకు మాత్రమే దారితీయదని, దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు 30 శాతం, మెదడులో రక్త స్రావం జరిగే అవకాశాలు 80 శాతం ఉన్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఇదిలావుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు చిన్న రక్తనాళాల సమస్య ఉండి, మైనర్ స్ట్రోక్‌ను అనుభవించిన 75 మంది ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వారిలో ప్రతి ఒక్కరికీ సిల్డెనాఫిల్, సిలోస్టాజోల్ ఔషధాలను ఇచ్చారు. ఇవే ఔషధాలను వరుసగా మూడు వారాలపాటు కొనసాగించారు. అదే సమయంలో వారిపై ఔషధాల ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం కార్డియోవాస్క్యులార్‌ ఫిజియాలజీ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు, ఫంక్షనల్ MRI స్కానింగ్‌లు నిర్వహించారు.

Latest News