Cow | భువనేశ్వర్ : ఇది షాకింగ్ న్యూస్.. ఓ ఆవు( Cow ) కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు( Plastic ) బయటపడ్డాయి. ఈ ఘటన ఒడిశా( Odisha )లోని గంజాం జిల్లా( Ganjam District )లోని ప్రభుత్వ వెటర్నరీ కాలేజీలో వెలుగు చూసింది.
గంజాం జిల్లాలోని బెహ్రాంపూర్ మున్సిపాలిటీ కార్పొరేషన్( Berhampur Municipal Corporation ) పరిధిలోని వీధుల్లో ఆవుల సంచారం ఎక్కువ. ఇక ఈ ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తూ.. రోడ్లపై పారవేయబడిన ఆహార పదార్థాలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను తినేస్తుంటాయి. అయితే ఓ ఆవు గత కొద్దిరోజుల మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతుంది. గమనించిన స్థానికులు ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ వైద్యులు తెలిపారు.
పశు వైద్యులు ఘటనాస్థలానికి చేరుకుని ఆవుకు శస్త్ర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆవును పశు వైద్యశాలకు తరలించారు. స్కానింగ్‌లు నిర్వహించగా, ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు గ్రహించారు. ఈ క్రమంలో సోమవారం మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించి, ఆవు కడుపులో ఉన్న 40 కిలోల వ్యర్థాలను బయటకు తీశారు. ఇందులో ఎక్కువగా పాలిథీన్ కవర్ల( Polythene bags )తో పాటు జీర్ణం కాని వస్తువులు ఉన్నట్లు జిల్లా పశు వైద్యాధికారి అంజన్ కుమార్ దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో వారం రోజులు డిశ్చార్జి చేస్తామన్నారు.
బెహ్రాంపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ విచ్చలవిడిగా వాడుతుండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.