రెండో దశలో 64శాతానికిపైగా పోలింగ్‌

రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో శుక్రవారం సాయత్రం ఐదు గంటల వరకు 64శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైంది. 13 రాష్ట్రాల్లోని 88 సీట్లలో శుక్రవారం పోలింగ్‌ ముగిసింది

  • Publish Date - April 26, 2024 / 08:40 PM IST

త్రిపురలో అత్యధికం.. యూపీలో అత్యల్పం

న్యూఢిల్లీ: రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో శుక్రవారం సాయత్రం ఐదు గంటల వరకు 64శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైంది. 13 రాష్ట్రాల్లోని 88 సీట్లలో శుక్రవారం పోలింగ్‌ ముగిసింది. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు, కొన్ని కేరళ, బెంగాల్‌లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బోగస్‌ ఓటింగ్‌ ఆరపణలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లోని బాన్స్వారా, మహారాష్ట్రలోని ప్రభనిలో వివిధ అంశాలపై నిరసనగా కొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్‌ను తొలుత బహిష్కరించినా.. అధికారులు సర్దిచెప్పడంతో ఓటింగ్‌కు వచ్చారు. పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత బాగా ఉన్నది. త్రిపురలో అత్యధిక ఓటింగ్‌ నమోదైంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 77.53 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. అత్యల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 52.74శాతం ఓటింగ్‌ జరిగింది.

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలు, కర్ణాటకలోని 28 సీట్లకు గాను 14, రాజస్థాన్‌లోని 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎనిమిది సీట్ల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బీహార్‌లలో ఐదేసి సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌లో మూడేసి సీట్లు, మణిపూర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ ముగిసింది. కేరళలో సాయంత్రం 5 గంటల వరకు 63.97 శాతం ఓటింగ్‌ జరిగింది. పోలింగ్‌ సందర్భంగా వేర్వేరు కారణాలతో పాలక్కడ్‌, అళప్పుళ, మలప్పురంలలో ఓటు వేసే సమయంలో ఒక్కొక్కరు చనిపోయారు. కోజికోడ్‌లో ఒక పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ప్రత్యేక సాయుధ దళం జవాన్‌ ఒక స్కూల్‌ వద్ద తన సర్వీసు తుపాకితో కాల్చుకుని చనిపోయాడు. మూడో విడుతలో మే 7వ తేదీన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 సీట్లకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Latest News