Site icon vidhaatha

Gallbladder stones | వృద్ధుడి క‌డుపులో 8 వేల రాళ్లు.. లెక్కించేందుకు 6 గంట‌ల స‌మ‌యం..

Gallbladder stones | ఓ వృద్ధుడి క‌డుపులో 8 వేల రాళ్లు( Gallbladder stones )బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రి ఆ రాళ్ల‌ను తొల‌గించేందుకు గంట స‌మ‌యం ప‌ట్ట‌గా, వాటిని లెక్క‌పెట్టేందుకు ఏకంగా 6 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ అరుదైన శ‌స్త్ర చికిత్స ఢిల్లీ( Delhi )లోని ఫోర్టిస్ మెమోరియ‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌( Fortis Memorial Research Institute )లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వృద్ధుడు(70) గ‌త ఐదేండ్ల నుంచి క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల ఆ వృద్ధుడికి క‌డుపు నొప్పి మ‌రింత తీవ్ర‌మైంది. క‌డుపు ఉబ్బ‌డం, జ్వ‌రం రావ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు అధిక‌మ‌య్యాయి. ఛాతీలో కూడా ఏదో బ‌రువు ఉన్న‌ట్లు అనిపించింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు ఆ వృద్ధుడిని ఢిల్లీని పోర్టిస్ మెమోరియ‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌( Fortis Memorial Research Institute )కు త‌ర‌లించారు.

వృద్ధుడి ఆరోగ్య ప‌రిస్థితి అప్ప‌టికే విష‌మంగా ఉండ‌డంతో.. వైద్యులు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. అల్ట్రాసౌండ్ స్కాన్( Ultrasound Scan ) నిర్వ‌హించారు. అత‌ని పిత్తాశ‌యం( Gallbladder )లో భారీగా రాళ్లు ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు త‌ర‌లించారు. ఇన్వాసివ్ లాప్రోస్కోపిక్ స‌ర్జ‌రీ నిర్వ‌హించి.. వృద్ధుడి పిత్తాశ‌యంలో పేరుకుపోయిన వేలాది రాళ్ల‌ను తొల‌గించారు. స‌ర్జ‌రీకి గంట స‌మ‌యం ప‌ట్ట‌గా, రాళ్ల లెక్కింపు ప్రక్రియ ఆరు గంటలపాటు కొన‌సాగింది. 8,125 రాళ్ల‌ను తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రాళ్లు ఏర్పడిన కేసు దిల్లీ నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌ ( NCR ) పరిధిలో ఇదే మొట్టమొదటిదై ఉండొచ్చని యాజమాన్యం తెలిపింది.

పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయకపోతే, రాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉంటాయని డాక్టర్ అమిత్ జావేద్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోగి నిర్లక్ష్యం కారణంగా రాళ్లు పెరిగాయని, ఇంకా ఆలస్యమై ఉంటే ఆరోగ్య పరిస్థితి విష‌మంగా ఉండేద‌ని చెప్పారు. పిత్తాశయంలో చీము ఏర్పడటం ప్రారంభమవుతుందని, ఫైబ్రోసిస్ కూడా సంభవించవచ్చని చెప్పారు. శరీరంలో కొవ్వుల సమతాస్థితి లోపించడం వల్ల గాల్‌స్టోన్స్‌ (పిత్తాశయ రాళ్లు) ఏర్పడుతుంటాయని, ఇది అరుదైన కేసుగా వర్ణించారు డా. అమిత్‌ జావేద్‌. దాని వల్ల పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని అన్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి నిల‌క‌డ‌గా ఉందని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత రెండు రోజుల పాటు పరిశీలన అనంతరం డిశ్చార్జ్‌ చేసినట్లు వెల్లడించారు.

Exit mobile version