బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన 9వ త‌ర‌గ‌తి బాలిక‌.. సీనియర్లే కారణమా!

గురుకులంలో చ‌దువుకుంటున్న ఓ బాలిక పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపుర జిల్లాలో జ‌నవ‌రి 9వ తేదీన

  • Publish Date - January 12, 2024 / 05:13 AM IST

బెంగ‌ళూరు : గురుకులంలో చ‌దువుకుంటున్న ఓ బాలిక పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపుర జిల్లాలో జ‌నవ‌రి 9వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. 

వివ‌రాల్లోకి వెళ్తే.. చిక్‌బ‌ళ్లాపుర జిల్లా తుమ‌కూరు తాలుకాలో ప్ర‌భుత్వ గురుకుల పాఠ‌శాల ఉంది. ఆ పాఠ‌శాల‌లో 14 ఏండ్ల బాలిక తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అయితే ఆమె ఇటీవ‌లే ఇంటికెళ్లింది. జ‌న‌వ‌రి 9వ తేదీన బాలిక‌కు తీవ్ర‌మైన క‌డుపు నొప్పి రావ‌డంతో, చికిత్స నిమిత్తం త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ బాలిక‌కు స్కానింగ్స్, ఇత‌ర వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, గర్భిణి అని తేలింది. 

దీంతో ఆమెకు డెలివ‌రీ చేయ‌గా, పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బాలిక త‌క్కువ బ‌రువు ఉన్న‌ప్ప‌టికీ, త‌ల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఆస్ప‌త్రి సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోక్సో చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

అయితే తాను గ‌ర్భం దాల్చ‌డానికి త‌న సీనియ‌ర్ కార‌ణ‌మ‌ని బాధితురాలు పోలీసుల విచార‌ణ‌లో చెప్పింది. విచార‌ణ‌లో భాగంగా ఆమె త‌డ‌బాటుకు గురికాగా, ప‌లువురి పేర్ల‌ను ప్ర‌స్తావించింది. బాలిక గ‌ర్భం దాల్చ‌డానికి కార‌కులైన వారిని గుర్తించి, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా విద్యాశాఖ ఉన్న‌తాధికారులు సీరియ‌స్‌గా స్పందించారు. గురుకులం వార్డెన్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.