Site icon vidhaatha

Vermicompost | కాసుల వ‌ర్షం కురిపిస్తున్న వ‌ర్మికంపోస్ట్.. నెల‌కు రూ. 7 ల‌క్ష‌లు సంపాదిస్తున్న వితంతువు

Vermicompost | అసోం( Assam ) న‌ల్‌బ‌రీ జిల్లాలోని బోర్జాహ‌ర్ గ్రామం( Borjhar Village ) అది. ఆ గ్రామానికి చెందిన క‌నికా తాలుక్‌దార్‌( Kanika Talukdar )కు చిన్న వ‌య‌సులోనే పెండ్లి అయింది. ఆమెకు 27 ఏండ్ల వ‌య‌సున్న‌ప్పుడు భ‌ర్త చ‌నిపోయాడు. అప్ప‌టికే నాలుగు నెల‌ల కూతురు ఉంది. ఇక బ‌త‌క‌డం క‌ష్టంగా మారింది. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దువుకుంది. ఎలాంటి వొకేష‌నల్ కోర్సులు కూడా పూర్తి చేయ‌లేదు.

క‌నికా తాలుక్‌దార్ త‌న నాలుగు నెల‌ల ప‌సిపాపతో క‌లిసి పుట్టింటికి తిరిగొచ్చింది. త‌న తండ్రి పొలంలోనే వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తూ స్వ‌యం స‌హాయ‌క గ్రూపులో స‌భ్య‌త్వం తీసుకుంది. ఇందులో భాగంగా మ‌హిళ‌ల‌కు గొర్రెల‌ను పంపిణీ చేశారు. క‌నికా గొర్రెల‌ను మేపుకుంటూ జీవ‌నం సాగించేది. 2014లో ఇదే స్వ‌యం స‌హాయ‌క గ్రూపు స‌భ్యుల‌కు ఐదు రోజుల పాటు వ‌ర్మి కంపోస్టు( Vermicompost )పై న‌ల్‌బ‌రి జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు.

వ‌ర్మికంపోస్టుతో పాటు పిసిక‌ల్చ‌ర్, ఫ్లోరీక‌ల్చ‌ర్‌, డెయిరీ ఫామ్‌పై కూడా అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. కానీ ఖ‌ర్చు దృష్ట్యా క‌నికా వ‌ర్మీకంపోస్టుపై దృష్టి సారించింది. అంటే త‌క్కువ పెట్టుబ‌డితో ఈ ప్రాజెక్టును ప్రారంభించొచ్చ‌ని క‌నికా భావించింది.

రూ. 500తో వ‌ర్మికంపోస్టు యూనిట్‌

శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ముగిసిన అనంత‌రం.. రూ. 500తో వ‌ర్మికంపోస్టు యూనిట్‌ను క‌నికా ప్రారంభించింది. వెదురు కర్ర‌ల‌తో వ‌ర్మికంపోస్టుకు కావాల్సిన నిర్మాణంతో పాటు ఇత‌ర వ‌న‌రుల‌ను ఏర్పాటు చేసుకుంది. ఆ త‌ర్వాత మేక పేడ‌, ఆవు పేడ‌తో పాటు ఇత‌ర ఆర్గానిక్ వ‌స్తువుల‌ను స‌మ‌కూర్చుకుంది. వీటితో పాటు చెట్ల ఆకుల‌ను, పంట కోసిన త‌ర్వాత మిగిలిన వాటిని కూడా స‌మ‌కూర్చుకుంది. ఇక ఒక కేజీ వాన‌పాముల‌ను కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కొనుగోలు చేసింది క‌నికా.

ఇప్పుడు నెల‌కు రూ. 7 ల‌క్ష‌ల సంపాద‌న‌

వెదురు కర్ర‌ల నిర్మాణాల మ‌ధ్య‌నే 800 కేజీల వ‌ర్మి కంపోస్టును ఆమె త‌యారు చేసింది. కేజీ నుంచి 5 కేజీల వ‌ర‌కు ప్యాకెట్ల రూపంలో వ‌ర్మికంపోస్టును త‌యారు చేసి.. స్థానిక మార్కెట్‌లో వీటిని విక్ర‌యించి తొలిసారి రూ. 8 వేలు సంపాదించింది క‌నికా. ఈ డ‌బ్బుతో త‌న యూనిట్‌ను విస్త‌రించింది. 2015లో 10 వేల‌ కిలోల వ‌ర్మికంపోస్టును త‌యారు చేశారు. దీంతో ల‌క్ష రూపాయాల ఆదాయం వ‌చ్చింది. 2017లో రూ. 1.70 ల‌క్ష‌క‌లు, 2023లో రూ. 3.5 ల‌క్ష‌ల‌కు చేరింది ఆదాయం. ఇవాళ క‌నికా త‌న‌కున్న అర ఎక‌రంలో నెల‌కు 90 వేల కేజీల వ‌ర్మి కంపోస్టును ఉత్ప‌త్తి చేస్తుంది. అలా నెల‌కు రూ. 7 ల‌క్ష‌లు సంపాదిస్తుంది.

10 మందికి ఉపాధి

క్ర‌మ‌క్ర‌మంగా ఆదాయం పెర‌గ‌డంతో.. వెదురు కర్ర‌ల స్థానంలో ప్లాస్టిక్ మెటిరీయ‌ల్‌ను ఉప‌యోగించి, కొత్త బెడ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు క‌నికా తెలిపింది. ప‌ర్మినెంట్‌గా సిమెంట్ బెడ్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ యూనిట్‌లో త‌యారైన వ‌ర్మి కంపోస్టును ప్ర‌భుత్వ న‌ర్స‌రీలు, విద్యాసంస్థ‌లకు హోల్‌సేల్ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్నారు క‌నికా. మొత్తంగా త‌న యూనిట్‌లో 10 మందికి ఉపాధి క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పార‌మె. అసోం, నాగ‌లాండ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మేఘాల‌య రాష్ట్రాల నుంచి రైతులు వ‌చ్చి వ‌ర్మి కంపోస్టును కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపింది క‌నికా తాలుక్‌దార్.

Exit mobile version