Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం తప్పింది. ఏనుగుల గుంపును ఢీకొట్టడంతో.. రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాద ఘటన అసోంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
జమునముఖ్ – కంపూర్ జంక్షన్ మధ్య వేగంగా వెళ్తున్న సైరంగ్ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఏనుగుల గుంపు అడ్డు వచ్చింది. దాంతో అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ రైలు ఏనుగులను ఢీకొట్టింది. ఎనిమిది ఏనుగుల్లో ఓ ఐదారు వరకు మృతి చెందాయి. రైలులోని ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం..
ఏనుగుల కళేబరాలు పట్టాలపై పడి ఉండడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాటి కళేబరాలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ గువహటి చేరుకోగానే మరిన్ని కోచ్‌లను అనుసంధానం చేసి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు.
