Site icon vidhaatha

మోదీ ధ్యానం ఓ చీప్‌ జిమ్మిక్‌.. మండిపడుతున్న వివేకానంద సంబంధిత కాలేజీ విద్యావేత్తలు

జిమ్మిక్కు అయినా దానికి ధైర్యం కావాలంటున్న మరికొందరు

కన్యాకుమారి: కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌ రాక్‌ వద్ద ప్రధాని నరేంద్రమోదీ సన్యాసి అవతారంలో 45 గంటల ధ్యానంపై వివేకానందుడు 1897లో స్థాపించిన రామకృష్ణ మిషన్‌ విద్యావేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అదొక చీప్‌ స్టంట్‌ అని చెబుతుంటే.. మరికొందరు మోదీని సమర్థిస్తున్నారు. గురువారం సాయంత్రం మొదలైన ధ్యానం.. శనివారం సాయంత్రంతో ముగిసింది. 1893లో వివేకానందుడు ధ్యానం చేసిన ప్రాంతాన్ని మండపంగా ఆయన పేరుతోనే అభివృద్ధి చేశారు. ‘ఇక్కడ స్వామీజీ (వివేకానంద) మూడు రోజులు వరుసగా ధ్యానం చేశారు.

దాని ముఖ్యోద్దేశం భరత మాత ఉన్నతి. తన దేశం మాతృభూమి క్షీణతపై తొలిసారి ప్రత్యేకించి ఒక సన్యాసి కన్నీరు పెట్టుకున్నారు. అథఃపాతాళానికి వెళ్లిపోయిన భారతదేశాన్ని ఉద్ధరించేందుకు ఆయన ధ్యానం చేశారు. అక్కడ ఒక ఆలయం, ధ్యానమండపం నిర్మించిన తర్వాత ఎవరైనా అక్కడికి వెళ్లి ధ్యానం చేసుకోవచ్చు. స్వామీజీకి నివాళులు అర్పించవచ్చు. ప్రధాని నరేంద్రమోదీ కూడా అదే చేశారు’ అని నరేంద్రపూర్‌లో ఆర్కే మిషన్‌ గురుకుల కళాశాలలో చరిత్ర ప్రొఫెసర్‌ సుశోభన్‌ సేన్‌ గుప్తా అన్నారు. అయితే.. ‘తాను ధ్యానం చేసుకుంటున్న సమయంలో అక్కడికి మీడియా వ్యక్తులను అనుమతించడం వేరే అర్థాన్ని కలిగిస్తున్నది. ఆయన 2019లో కేదార్‌నాథ్‌లో అదే చేశారు.

ఈనాటి రాజకీయ నాయకులకు నైతికతా లేదు.. వివేకమూ లేదు. అధికారం కోసం వారు ఎందాకానైనా వెళ్లగలరు. ఓటర్లలో సగం మంది నిరక్షరాస్యులైన మనలాంటి దేశంలో ఇటువంటి చీప్‌ స్టంట్స్‌ ఫలితాన్ని ఇస్తాయి’ అని ఆయన చెప్పారు. ఇదే కాలేజీలో గెస్ట్‌ టీచర్‌గా పొలిటికల్‌ సైన్స్‌ బోధిస్తున్న రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అచింత్యం ఛటర్జీ స్పందిస్తూ.. కొంతమంది అది రాజకీయ జిమ్మిక్కు అనుకున్నా.. అటువంటి జిమ్మిక్కు ధ్యానం ద్వారా చేయడానికి శక్తి కావాలని అన్నారు. రాజకీయాలకు మోదీ కొత్త పరిమాణాన్ని జోడించారని అన్నారు.

Exit mobile version