తమిళనాడులో డీఎంకే క్లీన్ స్వీప్
కత్తులు దూసుకుంటున్న అన్నాడీఎంకే, బీజేపీ
అన్నామలై నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
సీనియర్ నేతలను చూసి ఆయన నేర్చుకోవాలి
ఆయన వల్లే తమిళనాడులో కూటమి విచ్ఛిన్నం
నిప్పులు చెరిగిన అన్నాడీఎంకే నేత ఉదయకుమార్
చెన్నై: తమిళనాడులోని మొత్తం 39 స్థానాలతోపాటు పొరుగునే ఉన్న పుదుచ్చేరి స్థానాన్ని సైతం డీఎంకే నేతృత్వంలోని కూటమి క్వీన్ స్వీప్ చేయడం ఇప్పుడు అన్నాడీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ.. ఎన్నికలకు ముందు విడాకులు పుచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి కాస్త నోటిదూల కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పేవారూ ఉన్నారు. ఇదే అన్నామలై తాజా వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు రెండో స్థానంలో నిలిచిన చోట అన్నాడీఎంకేను మూడో స్థానంలోకి నెట్టివేయడమే తమ పార్టీ సాధించిన విజయమని బుధవారం అన్నామలై వ్యాఖ్యానించారు.
దీనిపై భగ్గుమన్న అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్.. రెండు పార్టీలు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడానికి అన్నామలై కారణమని దుమ్మెత్తారు. ఆయన కాస్త నోరు అదుపులో పెట్టుకుని ఉంటే.. కాస్త మెరుగైన ఫలితాలు ఉండేవని చెబుతూ.. ఇంతటి ఘోర పరాజయానికి అన్నామలై ఒక్కడే కారణమని మండిపడ్డారు. ఆయన అనుభవరాహిత్యానికి తమిళనాడులోని ఇతర పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రిటార్టిచ్చారు. వాళ్ల నాయకులను చూసి తెలుసుకోవాలని, అలాగే నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఢిల్లీ నేతలకు కూడా ఇంతటి ఇబ్బంది తలెత్తేది కాదని వ్యాఖ్యానించారు.
‘ఆయన చేసిన తప్పిదం ఢిల్లీలో బీజేపీకి సాధారణ మెజార్టీ కూడా దక్కకుండా చేసింది’ అని మదురైలో కీలక నేతగా భావించే ఉదయకుమార్ మండిపడ్డారు. మదురైలో అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచింది.
‘అన్నామలై వల్లే అన్నాడీఎంకే, బీజేపీ విడిపోవాల్సి వచ్చింది. అదే కూటమి ఉండి ఉంటే అనేక స్థానాలను గెలిచేవాళ్లం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాపై దాడి చేశాడు. ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోకుండా.. మమ్మల్ని అప్రదిష్ఠపాలు చేశాడు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి ఉంటే 30 నుంచి 35 సీట్లు గెలిచేవాళ్లమని కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి అన్నారు. దీనికి పూర్తి బాధ్యత అన్నామలైదేనని తేల్చి చెప్పారు. ‘తమిళి సై సౌందర్ రాజన్, ఎల్ మురుగన్ వంటివాళ్లు ఉన్నప్పుడు బీజేపీతో మా సంబంధాలు బలంగా ఉండేవి. అన్నామలై బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉపన్యాసాల కారణంగా విభేదాలు మొదలయ్యాయి.
మా పార్టీ మహానేతలైన సీఎన్ అన్నాదురై, జయలలితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు’ అని వేలుమణి విమర్శించారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ గురించి, ప్రస్తుత పార్టీ చీఫ్ ఎడప్పాడి కే పళని స్వామి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గుర్తు చేశారు. కోయంబత్తూరులో గతంలె బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుచుకున్న ఓట్లు కూడా అన్నామలై తెచ్చుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. కోయంబత్తూరు సీటులో అన్నామలై తన డీఎంకే ప్రత్యర్థి రాజ్‌కుమార్ చేతిలో 1,18,068 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే.. అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యలపై మండిపడిన అన్నామలై.. 2019లో బీజేపీ వల్లే తాము సీట్లు కోల్పోయామని అన్నాడీఎంకే నేతలు చెప్పారని, కూటమి నుంచి వైదొలిగి, 2024లో ఎక్కువ సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఇది వేలుమణి, పళనిస్వామి మధ్య అంతర్గత వైరుధ్యాలను బహిర్గతం చేస్తున్నదని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అదే అన్నాడీఎంకే ఎన్డీయే కూటమితో కలిసి ఉంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవని చెబుతున్నదని విమర్శించారు. దీనిపై అన్నాడీఎంకే ఐటీ విభాగం ఒక ప్రకటన చేస్తూ.. అన్నాడీఎంకే గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని విమర్శించింది. తమ నేతల గురించి మాట్లాడే ముందు ఆయన పార్టీకి ముంచుకొస్తున్న ముప్పును గుర్తించాలని హితవు పలికింది.