AIIB Rules out Bird Strike | అహ్మదాబాద్ విమాన దుర్ఘటన ప్రమాదమే : ఏఐఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడి

  • Publish Date - July 12, 2025 / 01:13 PM IST

AIIB Rules out Bird Strike | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఐఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికలో జూన్ 12న కుప్పకూలిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుట్రకోణం..పక్షి ఢీకొనడం వంటి కారణాలు కాదని వెల్లడించింది. కేవలం విమానం టేకాఫ్ అయ్యాక.. ఇంధన కంట్రోల్ స్విచ్ లు రెండు కూడా సెకన్ల వ్యవధిలో ఒకదాని తర్వాతా ఒకటి ఆగిపోవడం ప్రమాదానికి కారణమైందని పేర్కొంది. తిరిగి రన్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించగా ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీ అవడంలో విఫలమైందని వెల్లడించింది. ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లుగా అనిపించినప్పటికి..బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలినలో థ్రస్ట్ పనిచేసేందుకు ప్రయత్నించినట్లుగా కనిపించిందని..దీంతో ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందని ఏఐఐబీ తెలిపింది.

కాక్ పిట్ లో అవే ఆఖరి మాటలు

ప్రమాద సమయంలో ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు అని ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించారని..  తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడని.. కాక్ పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని.. ఆ తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని ఏఐఐబీ వెల్లడించింది. ఇంధన స్విచ్ లు రెండు ఒక సెకన్ తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు విమానం కేవలం 32 సెకండ్ల పాటు గాల్లో ఉన్నట్లు వెల్లడించింది. రన్ వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోనే మెడికల్ హాస్టల్ భవన్ పై విమానం కూలిపోయిందని తెలిపింది. ఇంజిన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ను యాక్టివేట్‌ చేసినట్లు గుర్తించారు. ఇది యాక్టివేట్‌ అయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించిందని ఏఏఐబీ తమ నివేదికలో వెల్లడించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఈలోపే విమానం కూలిపోయిందని వెల్లడించింది.

గతంలో ఇంధన స్విచ్ లలో సమస్యలు లేవు

టేకాఫ్ కు ప్లాప్ సెట్టింగ్..గేర్ సాధారణంగానే పనిచేశాయని…వాతావరణం, గాలులు..ఆకాశం అంతా అనుకూలంగానే ఉన్నాయని…ఏయిరిండియా పైలట్లు ఇద్దరు కూడా మెడికల్ గా ఫిట్ గానే ఉన్నారని వెల్లడించింది. పైలట్లరు సుధీర్ఘ అనుభవం ఉందని నివేదికలో స్పష్టం చేసింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని.. విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని నివేదికలో స్పష్టం చేసింది. ఇంధనం కూడా స్వచ్ఛందంగానే ఉందని పేర్కొంది. గతంలో ఈ విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్ లలో సమస్యలు వచ్చిన సందర్భాలు కూడా లేవని తెలిపింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసిందని..దీనిని ఎయిర్ ఇండియా అనుసరించలేదు. సంబంధిత తనిఖీలు చేపట్టలేదని.. విమానం థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్స్ ను 2019లో, 2023లో భర్తీ చేశారని నివేదికలో ఏఐఐబీ పేర్కొంది. విమానానికి సంబంధించి రెండు ఇంజన్లను వెలికి తీసినట్లు.. తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని..వాటన్నింటిని భద్రపరిచామని తెలిపింది.

విచారణకు సహకరిస్తాం

ఈ ప్రాథమిక నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని బాధితులకు అండగా ఉంటామని తెలిపింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రొటోకాల్‌ ప్రకారం.. ఏఐ-171కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఏఐబీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని పేర్కొంది. ఈ విమాన ప్రమాదంలో విమాన ప్రయాణికుల్లో 242 మందిలో ఒకరు తప్ప అందరూ చనిపోయారు. విమానం పడిన మెడికల్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది మరో 30మంది మరణించారు. మొత్తం 270మందికి పైగా చనిపోయినట్లుగా గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.