Black box: అహ్మదాబాద్ లో జరిగిన ఘోరమైన విమానప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు కచ్చితమైన కారణం ఏదీ తెలియదు. సాంకేతిక లోపమా.. పక్షి తాకడం వల్ల ప్రమాదం జరిగిందా.. అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా తాజాగా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. దీంతో బ్లాక్ బాక్స్ లో ఉండే సమాచారం ఆధారంగా ప్రమాదానికి గత కచ్చితమైన కారణాన్ని తెలుసుకొనే అవకాశం ఉంది. విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ముమ్మరంగా తనిఖీ చేస్తున్నది. మొత్తం 40 మంది సిబ్బంది ఎంక్వైరీలో పాల్గొంటున్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..
విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ క్రాష్‌లు జరిగినప్పుడు సాధారణంగా బ్లాక్ బాక్స్ గురించి వింటూ ఉంటాం. ఈ బాక్స్ ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనే అవకాశం ఉంది. విమానం మొత్తం శకలాలుగా విడిపోయిన.. ఈ బ్లాక్ బాక్స్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రమాద సమయంలో జరిగిన సంభాషణాలు, విమానానికి సంబంధించిన సాంకేతిక వివరాలు ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతాయి. అందువల్లనే ప్రమాదానంతర దర్యాప్తులో ఇది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది.
బ్లాక్ బాక్స్ ప్రత్యేక ప్రత్యేకతలు ఇవే..
బ్లాక్ బాక్స్ విద్యుత్ సరఫరా లేకపోయినా సుమారు 30 రోజుల పాటు పని చేయగలదు. దాదాపు 11000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అయితే ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవడం కూడా ఓ సవాలే. ఇందుకోసం బ్లాక్ బాక్స్ నుంచి నిరంతరం బీప్ శబ్ధం వస్తూ ఉంటుంది. ఈ శబ్ధాలను పరిశోధకులు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి వినేందుకు అవకాశం ఉంటుంది. ఇది సముద్రంలో 14,000 అడుగుల లోతు నుంచీ కూడా తన సంకేతాలను వెలువరించగలదు.