Site icon vidhaatha

Haryana Assembly Elections । హర్యానాలో ముందే చేతులెత్తేసిన బీజేపీ? కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి వ్యాఖ్యల వెనుక!

Haryana Assembly Elections । ఈ ఏడాది అక్టోబర్‌ 1న జరుగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) నేపథ్యంలో బీజేపీ నేతల్లో బేలతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఉపన్యాసాల్లో నోరుజారుతున్నారు. ప్రేలాపనలు చేస్తున్నారు. మంగళవారం భివానిలో నిర్వహించిన సభలో మాట్లాడిన హర్యానా ఆర్థిక మంత్రి జేపీ దలాల్‌.. ఒక అడుగు ముందుకేసి తమ ఓటమి ఖాయమన్న విషయం చెప్పకనే చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ‘ఢిల్లీలో ఉన్న మా నాయకులు ఆ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండకుండా చూసుకుంటారు’ అని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. దలాల్‌ మాటలు అక్టోబర్‌ 1న జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

హర్యానాలో బీజేపీ పట్టు జారిపోతున్నదని (BJP is losing ground in Haryana) 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha election) పోల్చితే కాంగ్రెస్‌ అక్కడి అసెంబ్లి నియోజకవర్గాల్లో తన విజయాలను 12.3 శాతం పెంచుకోవడం గమనార్హం. బీజేపీకి 2.17శాతం స్వింగ్‌ కనిపిస్తున్నది. పోలింగ్‌ కేంద్రాల డాటాను గమనిస్తే.. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 44 నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం చూపింది. మరోవైపు కాంగ్రెస్‌ 42 సీట్లలో, ఆమ్‌ ఆద్మీ పార్టీ 4 సీట్లలో ఓట్లను పెంచుకున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించే (getting a government job) యువత ఉన్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగం (unemployment), రైతుల అంశాలు ఎన్నికల ప్రచారాల్లో ప్రధానంగా వినిపించాయి. ఫలితంగానే ఐదు లోక్‌సభ సీట్లలో బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది.

నిరుద్యోగిత, కనీస మద్దతు ధర (minimum support price) (ఎంఎస్‌పీ) అనేవి హర్యానాలో అతిపెద్ద అంశాలు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే కీలకం. పండించిన పంటలకు తగిన ధర, కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాదిపాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతుల ఆందోళనలో చనిపోయినవారికి స్మారకం నిర్మించడం వంటి అంశాలను సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) హర్యానా యూనిట్‌ లేవనెత్తుతున్నది. రాష్ట్రంలోని యువతోపాటు.. రైతులు కూడా ఆర్మీలో తాత్కాలిక నియామకాల కోసం ఉద్దేశించి అగ్నివీర్‌ పథకాన్ని (Agniveer Yojana) వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హర్యానా యువత ఈ పథకంతో తీవ్రంగా నష్టపోయారు. ఆర్మీలో, భద్రతా సంస్థల్లో అత్యధిక సంఖ్యలో యువత ఉన్న రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి.

అక్టోబర్‌ 1న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ‘నాన్‌ స్టాప్‌ హర్యానా’ (Non-stop Haryana) నినాదంతో ప్రచారంలోకి దిగింది. మరోవైపు భూపిందర్‌సింగ్‌ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ‘హర్యానా మాంగే హిసాబ్‌’ (Haryana Maange Hisaab) పేరుతో ప్రచారం చేస్తున్నది. రెండు పార్టీలు తమ తమ నినాదాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దుష్యంత్‌ చౌతాలకు సంబంధించిన జననాయక్‌ జనతా పార్టీ (Jannayak Janata Party) (జేజేపీ) కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీలక అంశంగా ఉండబోతున్నది. గత అసెంబ్లీలో జేజేపీకి (JJP) పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం (coalition government) ఏర్పడేందుకు మద్దతు పలికారు. కానీ.. రైతుల ఉద్యమం నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో సంబంధాలను జేజేపీ తెంచుకున్నది. అది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపడటానికి దోహదం చేసింది. జేజేపీ ప్రధానంగా జాట్‌ కమ్యూనిటీ (Jat community) ఓటర్లపై ఆధారపడిన పార్టీ. రైతుల ఉద్యమం నేపథ్యంలో దాని మద్దతుదారులు తగ్గిపోయారు. ఈ ఎన్నికల్లో జేజేపీ.. బీజేపీతో కలిసి లేదు. వాస్తవానికి జేజేపీలోనే చీలిక ఉన్నది. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చింది.

హర్యానా రాజకీయాల్లో జాట్‌ కమ్యూనిటీ ప్రభావాన్ని నిరోధించేందుకు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓబీసీని బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. కానీ.. ఫలితాలు చూస్తే బీజేపీ వ్యూహం ఫలించినట్టు లేదు. పైగా.. జాట్‌, జాట్‌ యేతర అంశాలు జాట్‌లను ఏకం చేశాయి. వ్యూహాత్మకంగా ఓటు వేసేందుకు దారి తీశాయి. ఫలితంగా జాట్‌లలోని బీజేపీయేతర అభ్యర్థులకు జాట్‌ల ఓట్లు పడ్డాయి. బీజేపీని ఆందోళనకు గురి చేస్తున్న మరో అంశం.. పరివార్‌ పెహచాన్‌ పాత్ర (Parivar Pehchan Patra) వంటి మాజీ ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ పథకాలపై సాధారణ ఓటర్లలో అసమ్మతి. తగిన వివరాలు సేకరించకుండానే ఈ పథకాన్ని అమలు చేశారని, దానితో ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకోలేక పోయారని తీవ్ర విమర్శలు వచ్చాయి. పెన్షన్‌ స్కీమ్‌పైనా ఇదే తరహా విమర్శలు ఉన్నాయి. ఈ పథకాన్ని మాజీ ఉప ప్రధాని, జాట్‌ నేత దేవీలాల్‌ (Devi Lal) మొదట తీసుకువచ్చారు.

మరో అంశం యువత. దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలనే హర్యానా యువత కూడా ఎదుర్కొంటున్నప్పటికీ నిరుద్యోగ సమస్య వారిని తీవ్రంగా వేధిస్తున్నది. వ్యవసాయ రంగంలో, సాయుధ దళాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు ముందున్నట్టు ఇప్పుడు లేవు. దీంతో వారిలో ఒక రకమైన అభద్రతా భావం పెరుగుతున్నది. వ్యవసాయ ఎంతమాత్రం లాభసాటిగా కనిపించడం లేదు. పారిశ్రామిక రంగంలోనూ తగిన ఉద్యోగాలు లభించడం లేదు. తాత్కాలిక సాయుధ దళాల నియామక పథకమైన అగ్నిపథ్‌ కూడా జాబ్‌ సెక్యూరిటీని ఇవ్వడం లేదు. వెరసి.. హర్యానాలో ఉద్యోగావకాశాల అంశం చర్చను రాజేస్తున్నది. నిరుద్యోగిత అంశంపై అధికార, విపక్షాలు తమ తమ లెక్కలతో వాదనలకు దిగుతున్నా.. దేశంలోనే నిరుద్యోగం అత్యధిక స్థాయిలో హర్యానాలోనే ఉన్నట్టు కొన్ని గణాంకాలు పేర్కొంటున్నాయి.

అందుకే వేల మంది విద్యార్థులు మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ హర్యానాను వదిలి పోతున్నారు. కొందరు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వ్యాపార, పారిశ్రామిక ప్రాంతాలైన గురుగావ్‌ వంటి చోట్ల వేర్వేరు కారణాలతో పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. సరైన ఉద్యోగం దొరకడం గగనంగా మారింది. పొట్టకూటికి గౌరవప్రదమైన ఆదాయం సంపాదించుకోవడం హర్యానా యువతకు, రైతులకు అతిపెద్ద సవాలుగా తయారైంది. నిరుద్యోగం విషయంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌, రాజస్థాన్‌ కంటే దయనీయ స్థితిలో హర్యానా ఉన్నదని సీఎంఐఈ (CMIE) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితికి నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

హర్యానాలో కార్మికుల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నది. ఆటోమొబైల్‌, టెక్స్‌టైల్‌ సహా రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లో 50 లక్షల నుంచి 60 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) (Centre of Indian Trade Unions (CITU)) ప్రధాన కార్యదర్శి జై భగవాన్‌ చెబుతున్నారు. వారిలో సగం మంది మాత్రమే అంటే.. 28 లక్షల మందే ఈఎస్ఐ సదుపాయం కలిగి ఉన్నారని తెలిపారు. అంటే.. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సగం మంది కార్మికులకు ఈఎస్‌ఐ, ఇతర ప్రభుత్వం నుంచి అందే ఇతర బెనిఫిట్లు అందడం లేదు. తగిన చట్టాలు లేకపోవడంతో కనీస వేతనాలు అందటం లేదు. కొన్ని పరిశ్రమల్లో 12 గంటలపాటు పనిచేసినా 8 గంటలకే వేతనం లెక్కగడుతున్నారని జై భగవాన్‌ చెప్పారు. హర్యానాలో పాదరక్షల పరిశ్రమ ఆసియాలోనే అతిపెద్దదిగా చెబుతారు. కానీ.. వారికి ఎలాంటి సదుపాయాలు అందడం లేదని అన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇన్ని సమస్యల నడుమ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనడం బీజేపీ అంత సులభం ఏమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వాతావరణంలో మార్పు కనిపిస్తున్నదనేందుకు బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version