వాయనాడ్‌లో ప్రియాంక తరఫున … బెంగాల్‌ సీఎం మమత ప్రచారం?

లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఇండియా కూటమి బలంగా ఉన్నదనే సంకేతాలు ఇచ్చేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. కేరళలోని వాయనాడ్‌ నుంచి పార్లమెంటరీ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైన ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారని తెలుస్తున్నది.

  • Publish Date - June 22, 2024 / 03:58 PM IST

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఇండియా కూటమి బలంగా ఉన్నదనే సంకేతాలు ఇచ్చేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. కేరళలోని వాయనాడ్‌ నుంచి పార్లమెంటరీ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైన ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారని తెలుస్తున్నది. వాయనాడ్‌, రాయ్‌బరేలీ స్థానాల నుంచి గెలిచిన కాంగ్రెస్‌ నేత, తన సోదరుడు రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలీని తన వద్ద ఉంచుకుని, వాయనాడ్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీని నిలపాలన కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ప్రియాంక తరఫున ప్రచారానికి వెళ్లేందుకు మమతాబెనర్జీ అంగీకరించారని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనే ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీచేయాలని మొదట్లోనే మమత సూచించిన విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావించాయి. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం కొద్ది రోజులక్రితమే తృణమూల్‌ చీఫ్‌ను కలిసిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. మర్యాదపూర్వకంగా జరిగిన సంభాషణగా పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. 30 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం.

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని ఆమె కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలకు 232 సీట్లు లభించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలల్లో బెంగాల్‌లో కాంగ్రెస్‌, తృణమూల్‌ మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. తాను ఒంటరిగానే బీజేపీని ఎదుర్కొంటానన్న మమతాబెనర్జీ.. చెప్పిన మాట ప్రకారం ఒంటరిపోరులోనే బీజేపీని నిలువరించారు. తాము ఇప్పుడు కలిసిలేకపోయినా.. ఎన్నికల అనంతరం తమ మద్దతు ఇండియా కూటమికే ఉంటుందని ఎన్నికల సందర్భంగానే మమతాబెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 29 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ (99), సమాజ్‌వాది పార్టీ (37) తర్వాత విపక్షంలో మూడో అతిపెద్ద పార్టీగా తృణమూల్‌ నిలిచింది.

Latest News