Site icon vidhaatha

Swati Maliwal | నా శరీర సున్నిత భాగాలను గాయపరిచాడు : స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణ

Swati Maliwal | ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ (Swati Maliwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Bibhav Kumar) దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దాడి నేపథ్యంలో స్వాతికి శుక్రవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో దాదాపు మూడు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె ముఖంలో అంతర్గత గాయాలైనట్లు తేలింది (internal injuries on face).

మరోవైపు ఈ ఘటనపై స్వాతి మలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అదేవిధంగా స్వాతి మలివాల్‌ నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. బిభవ్‌ కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడటంతో పాటు, తన సున్నితమైన శరీర భాగాలపై అనేకసార్లు దాడిచేసి గాయపరిచాడని ఆరోపించింది. కాలితో తన్ని, కర్రతో కూడా బాదినట్లు, కడుపుపై బలంగా కొట్టినట్లు పోలీసులకు తెలిపింది.

కాగా, ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ సైతం సుమోటోగా తీసుకుంది. బిభవ్‌ కుమార్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. దాడి వ్యవహారంపై మలివాల్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, తన పట్ల జరిగింది చాలా దారుణమని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో మహిళలకు రక్షణ కరువైందనీ, వారు ఎంత పెద్దవారైనా కూడా భంగపాటు తప్పడంలేదని, శాంతిభద్రతలు పూర్తిగా మృగ్యమైపోయాయని వాపోయారు. గత కొన్ని రోజులు తనకు చాలా భారంగా గడిచాయని, తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. బిజేపీ వాళ్లు దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మౌనం

మలివాల్‌పై దాడి ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నోరువిప్పలేదు. గురువారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వాతి మలివాల్‌ ఘటనపై మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు.

ఆమ్​ఆద్మీ నేత సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ, మణిపూర్‌లో కార్గిల్‌ యుద్ధవీరుడి భార్యను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటికీ నోరెత్తడం లేదని, వేలాది మంది మహిళలపై లైంగికదాడికి పాల్పడిన ప్రజ్వల్‌ రేవణ్ణను దేశం దాటించేందుకు బీజేపీ సహకరించిందని ఆరోపణలు చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేసినప్పుడు స్వాతి మలివాల్‌ అక్కడికి వెళ్తే ఆమె పట్ల పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు.

Exit mobile version