- బీహార్ అసెంబ్లీలో తగ్గిన ముస్లిం ప్రాతినిధ్యం
- ఈ ఎన్నికల్లో పది మంది గెలుపు
- రాష్ట్ర జనాభాలో ముస్లింలు 17.7 శాతం
హైదరాబాద్, విధాత : బీహార్ చట్ట సభల్లో ముస్లిం ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం తగ్గింది. రెండేళ్ల క్రితం నిర్వహించిన కుల గణన లెక్కల ప్రకారం ముస్లిం లు13.07 కోట్లు (17.7 శాతం) ఉండగా, ఆ స్థాయిలో ప్రాతినిధ్యం పెరగడం లేదు. 1990 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువగా పది మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
సీమాంచల్ ప్రాంతంలోని అరారియా, పూర్నియా, కతిహార్, కిషన్ గంజ్ జిల్లాల నుంచి ఎంఐఎం తరఫున ఐదుగురు గెలుపొందారు. ఎంఐఎం పార్టీ మొత్తం 25 మంది ని పోటీ చేయించగా, అందులో ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. జేడీయూ నలుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టగా కైమూరు జిల్లాలోని చైన్ పూర్ నియోజకవర్గం నుంచి మొహ్మద్ జమా ఖాన్ గెలుపొందారు. ప్రస్తుతం నితీష్ క్యాబినెట్ లో జమాఖాన్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా హిందూ ఓటర్లు ఉన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ నాయకులు జమాఖాన్ కు ప్రచారం చేయడంతో గెలుపొందారు. కిషన్ గంజ్ జిల్లాలో బహదూర్ గంజ్ నుంచి మహ్మద్ ఖలీముద్దీన్ లోక్ జనశక్తి పార్టీ నుంచి పోటీచేశారు. ఇక్కడి నుంచే పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి లోక్ జనశక్తి అభ్యర్తి ఖలీముద్దీన్ పై గెలుపొందారు. ఆర్జేడీ అభ్యర్థులు ఆసిఫ్ అహ్మద్ బిస్పీ నియోకవర్గం నుంచి, ఒసామా సాహబ్ రఘునాథ్ పూర్ నుంచి గెలుపొందారు. ఆర్జేడీ సీనియర్ నాయకుడు షాహబుద్దీన్ కుటుంబం నుంచి 21 సంవత్సరాల క్రితం రఘునాథ్ పూర్ లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఈ నియోజకవర్గం నుంచి ఇతరులు గెలుపొందుతున్నారు. ఇక్కడ యాదవులు అధిక సంఖ్యలో ఉండడంతో తొలుత హరిశంకర్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించి, ఆ తరువాత విరమించుకుని ఒసామాకు ఇచ్చారు. సీమాంచల్ ప్రాంతంలో 2020 మాదిరే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లను దక్కించుకోలేకపోయింది. కిషన్ గంజ్ నుంచి మహ్మద్ ఖమ్రుల్ హోడా, అరారియా నుంచి అబిదుర్ రహ్మన్ పోటీ చేయగా అబిదుర్ మాత్రమే విజయం సాధించారు.
‘కడ్వా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ పోటీ చేయగా జేడీయూ అభ్యర్ధి దులాల్ చంద్ర గోస్వామి గెలుపొందారు.
బీహార్ అసెంబ్లీకి 2010 లో జరిగిన ఎన్నికల్లో 19 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపొంది అసెంబ్లీల అడుగు పెట్టారు. జేడీయూ నుంచి ఏడుగురు, ఆర్జేడీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, లోక్ జనశక్తి నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. పూర్నియా జిల్లాలోని అమోర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అబ్ధుల్ జలీల్ మస్తాన్ పై బీజేపీ అభ్యర్థి సబా జాఫర్ విజయబావుటా ఎగురవేశారు. ఆ తరువాత 2015 లో 24 మంది గెలుపొందగా, ఆర్జేడీ నుంచి 12 మంది, ఆరుగురు కాంగ్రెస్, ఐదుగురు జేడీయూ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నుంచి ఒకరు గెలుపొంది చట్ట సభలో అడుగుపెట్టారు. 2020 లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం సభ్యుల సంఖ్య తగ్గి 19కి చేరుకున్నది. ఆర్జేడీ నుంచి 8 మంది, ఎంఐఎం 5గురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, బీస్పీ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ జేడీయూ తరఫున 11 మంది ముస్లిం అభ్యర్థులకు బీ ఫారం లు ఇచ్చినప్పటికీ ఒక్కరు కూడా సభలో అడుగుపెట్టలేదు.
