Prashant Kishor’s Jan Suraaj Party : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ వైఫల్యమెందుకు?

రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రమైన బీహార్‌లో తన జన సురాజ్ పార్టీ (JSP) ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సంప్రదాయ కుల రాజకీయాలు, లోతైన క్షేత్రస్థాయి నెట్‌వర్క్ లేకపోవడం, ఈబీసీ (EBC) ఓటు బ్యాంకును ఆకర్షించలేకపోవడం ఈ వైఫల్యానికి ప్రధాన కారణాలు.

Prashant Kishor's Jan Suraaj Party

దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కు బీహార్ ప్రజలు షాకిచ్చారు. పలు రాజకీయ పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన… స్వంత రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అసలు ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన సురాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడానికి కారణాలు ఏంటి? ఎన్డీఏ, మహాఘట్ బంధన్ పోటీలో జనసురాజ్ పార్టీ ప్రజలకు చేరువ కాలేకపోయిందా? బీహార్ వాసుల తీర్పును పరిశీలిద్దాం.

నిరాశతో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగేట్రం

భారత్ లో టాప్ రాజకీయ స్ట్రాటజిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ రంగ ప్రవేశం నిరాశతోనే ప్రారంభమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2024 అక్టొబర్ 2న ఆయన జన సురాజ్ పార్టీ జేఎస్‌పీని ఏర్పాటు చేశారు. బీహార్ లోని 238 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలుచుకోలేదు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడంతో పాటు ఇతరత్రా కారణాలతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బీహార్ లో మార్పు రావాలని ఆయన కోరుకున్నారు. ఈ దిశగానే ఆయన ప్రచారం చేశారు. కానీ, బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ ప్రచారాన్ని సరిగా అర్ధం చేసుకోలేదని తేలింది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రశాంత్ కిషోర్ కు గుణపాఠం నేర్పాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల నాడిని అర్ధం చేసుకోలేదా?

బీహార్ లో మార్పు కోసం అంటూ ప్రశాంత్ కిషోర్ ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ, ప్రజలు ఈ ప్రచారాన్ని అంతగా అర్ధం చేసుకోలేకపోయారు. బీహార్ కుల ఆధిపత్య రాజకీయాలకు చెక్ పడాలని కోరుకున్నారు. ప్రజలే నడిపే ప్రత్యామ్నాయంగా జన్ సురాజ్ పార్టీగా తీర్చిదిద్దాలని భావించారు. పాలన, విద్య, ఉద్యోగం, వలసలపై ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేశారు. పట్టణ, యువ ఓటర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ప్రణాళికలను సిద్దం చేశారు. ప్రస్తుత సంప్రదాయ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. కానీ, జేఎస్ పీ సామాజిక సంకీర్ణాన్ని నిర్మించలేకపోయింది. తమ పార్టీ ర్యాలీలకు, పాదయాత్రకు వచ్చిన జనాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయింది. అంతేకాదు బీహార్ లో లోతుగా పాతుకుపోయిన కుల సమీకరణాలు మరోసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయి. ప్రశాంత్ కిషోర్ సూచించిన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు ప్రజలకు అంతగా కనెక్ట్ కాలేదు.బీహార్ లో అత్యంత నిర్మణయాత్మక శక్తిగా ఉన్న అత్యంత వెనుకబడిన తరగతులు ఈబీసీలను విస్మరించారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈబీసీ ఓటు బ్యాంకును సమర్ధవంతంగా లక్ష్యంగా చేసుకోలేకపోవడంతో ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆశించిన ప్రయోజనాన్ని పొందలేకపోయారు.

క్షేత్రస్థాయిలో లేని నెట్ వర్క్

జన సురాజ్ పార్టీకి గ్రామ స్థాయిలో పటిష్టమైన నెట్ వర్క్ లేదు. అంతేకాదు ఆ పార్టీకి ఇతర పార్టీలతో పొత్తులు కూడా లేవు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు, మహాఘట్‌బంధన్ లోని ఇతర పార్టీలకు గ్రామస్థాయిల్లో క్షేత్రస్థాయిలో పట్టుంది. నెట్ వర్క్ ఉంది. ఇవి ఆయా కూటములకు కలిసి వచ్చాయి. జేఎస్‌పీకి ఈ ఎన్నికలే ఫస్ట్. క్షేత్రస్థాయిలో సంస్థాగత నెట్ వర్క్ పై ఆ పార్టీ ఫోకస్ చేయలేదు. సోషల్ మీడియా ప్రచారంపై ఆ పార్టీ ఎక్కువగా కేంద్రీకరించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. బలమైన సంస్థాగత నెట్ వర్క్ ఉన్న పార్టీతో గానీ, పార్టీలతో గానీ జెఎస్‌పీ జతకడితే మెరుగైన ఫలితాలు వచ్చేవనే అభిప్రాయాలు కూడా లేవు. రాజకీయ మార్పు కోసం ఆప్ ఆవిర్భవించింది. పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేసింది. ఆ వర్గం ప్రజలను ఆకర్షించింది. ఇది ఆ పార్టీకి ఎన్నికల్లో కలిసివచ్చింది. కానీ, బీహార్ రాజకీయాల్లో కులాలు కీలకంగా పనిచేస్తాయి. ప్రజలతో సంబంధాలు లేకుండా, గ్రామాల్లో స్వంతంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోకపోవడం కూడా జేఎస్‌పీకి నష్టం చేసింది. ఇతర పార్టీలకు బూత్ స్థాయిల్లో సంస్థాగత నిర్మాణం ఉంది. ఇది ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లేలా చేస్తుంది. కానీ, జేఎస్‌పీకి ఆ నెట్ వర్క్ లేదు.

ఒకే ఒక్కడు

జన సురాజ్ పార్టీకి ఒకే ఒక్క నాయకుడు అతనే ప్రశాంత్ కిషోర్. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీకి నిలిపే బదులుగా తమకు మంచి పట్టున్న లేదా గెలుస్తామనే నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపితే ఆశించిన ఫలితాలు వచ్చేవనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలకు జన సురాజ్ పార్టీకి మధ్య వ్యత్యాసం ఏమిటో ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. కానీ, జనసురాజ్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయలేదు. కానీ, బీహార్ లో ముస్లింలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ సభలకు జనం భారీగా హాజరయ్యారు. కానీ, ఈ సభలకు హాజరైనవారిని ఓట్లుగా మలుచుకోవడంలో ఆ పార్టీ వైఫల్యం చెందింది. జేఎస్ పీ అభివృద్ది మంత్రాన్ని జపించింది. కానీ, కులాల ఆధారంగానే బీహార్ లో రాజకీయాలు సాగుతాయనే విషయాన్ని ఆ పార్టీ విస్మరించింది.