Site icon vidhaatha

బీహార్‌లో.. ఏ కులం వారు ఎంతమందంటే..

పాట్నా: బీహార్‌ కులగణన వివరాలను ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమవారం విడుదల చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ వివరాలు బహిర్గతం చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బీహార్‌ జాతి ఆధారిత్‌ గణన పేరిట చేపట్టిన ఈ సర్వే తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. తదుపరి జనగణనలో దేశవ్యాప్తంగా కుల గణనను కూడా చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


బీహార్‌ మొత్తం జానాభాలో ఓబీసీ తరగతుల వారి సంఖ్య 63శాతంగా తేలింది. షెడ్యూల్డ్‌ తరగతుల జనాభా దాదాపు 19శాతంపైగా.. అంటే సుమారు 13 కోట్ల మంది ఉన్నారని కులగణనలో వెల్లడైంది. షెడ్యూల్డ్‌ జాతుల జనాభా 1.68 శాతం ఉన్నది. అగ్రవర్ణాల జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 15.52 శాతంగా ఉన్నట్టు సర్వే తెలిపింది.


వెనుకబడిన తరగతులవారు 27శాతం ఉంటే.. అత్యంత వెనుకబడిన తరగతులవారు (ఎంబీసీ) 36శాతం ఉన్నారు. వీరందరి జనాభా అంటే.. ఓబీసీల జనాభా కలిపితే 63 శాతంగా ఉన్నది. మండల్‌ ఉద్యమం నుంచి బీహార్‌లో రాజకీయంగా ఈ వర్గాలే ప్రాబల్యం కలిగి ఉన్నాయి. భూమిహార్‌లు 2.86%, బ్రాహ్మణులు 3.66 శాతం ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు చెందిన కుర్మీలు 2.87 శాతం ఉన్నారు. ముసాహర్లు 3శాతం, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ సామాజికవర్గమైన యాదవులు 14శాతం ఉన్నారు.


బీజేపీ వ్యతిరేకతను అధిగమించి..


కుల గణన విషయంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అనేక న్యాయపరమైన అడ్డంకులను సైతం అధిగమించాల్సి వచ్చింది. ఈ నివేదిక రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకునే విషయంలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఈ రోజు శుభసందర్భమైన గాంధీ జయంతిని పురస్కరించుకు బీహార్‌ కుల గణన వివరాలను ప్రచురించాం.


కుల ప్రాతిపదికన వివరాలు సేకరించే పనిలో భాగస్వాములైన అందరికీ శుభాకాంక్షలు’ అని నితీశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘కుల గణన లెక్కలు ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులపై వివరాలు తెలియజేస్తాయి. ఈ నివేదిక ఆధారంగా ఆయా వర్గాల అభ్యున్నతికి తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. బీహార్‌ అసెంబ్లీలోని తొమ్మిది పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, కుల గణన నివేదిక, దీని ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని చెప్పారు.


చారిత్రాత్మక సందర్భం


ఇదొక చారిత్రాత్మక సందర్భమని ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ‘ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ చారిత్రాత్మక సందర్భానికి మనం సాక్షీభూతులయ్యాం. బీజేపీ నుంచి అనేక కుట్రలు ఎదురైనా, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైనా బీహార్‌ ప్రభుత్వం కుల ప్రాతిపదికన జరిగిన సర్వే వివరాలు బహిర్గతం చేసింది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. సామాజిక న్యాయానికి కులగణన ఎంతో కీలకమైనదని బీహార్‌ ప్రభుత్వం చెబుతున్నది. ఈ విషయంలో సుప్రీం కోర్టు సైతం బీహార్‌ ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డు చెప్పలేదు. దీంతో కులగణనను బీహార్‌ ప్రభుత్వం ముగించింది.


బీహార్‌ మొత్తం జనాభా : 13 కోట్లు


హిందువులు : 82%

ముస్లింలు 17.7%

కులాలవారీగా వివరాలు

యాదవులు – 14.26%

రావిదాస్‌, చామర్‌ – 5.2%

కొయిరి – 4.2%

బ్రాహ్మణులు – 3.65%

రాజ్‌పుట్‌- 3.45%

ముషార్‌ – 3.08%

భూమిహార్‌ – 2.86%

కుర్మి – 2.8%

మల్లా – 2.60%

బనియా – 2.31%

కాయస్తులు – 0.60%

వర్గాల వారీగా వివరాలు

వెనుకబడిన తరగతులు – 27%

బాగా వెనుకబడి తరగతులు – 36%

షెడ్యూల్డ్‌ కులాలు – 19%

షెడ్యూల్డ్‌ తెగలు – 1.6%

జనరల్‌ క్యాటగిరీ – 15%

Exit mobile version