గుణ, మధ్యప్రదేశ్: విద్యార్థులు డిగ్రీలు పొందడం వల్ల వచ్చేదేమీ లేదని, మోటారుసైకిలు పంక్చర్ రిపేరు దుకాణాలు తెరుచుకోవడం ఉత్తమమని గుణ శాసనసభ్యుడు పన్నాలాల్ శాక్య సలహా ఇచ్చారు. సోమవారం గుణలో జరిగిన ‘ప్రధాన మంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండోర్‌లో ఇదే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా గుణలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ‘ఇవ్వాళ మనం ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించుకుంటున్నాం.
నేను ఒక మాట అందరికీ చెప్పదల్చుకున్నాను-ఈ కాలేజీ డిగ్రీల వల్ల సాధించేదేమీ లేదు. మోటారు సైకిలు పంక్చరు రిపేరు దుకాణం తెరుచుకుని కనీస జీవనోపాధిని సంపాదించుకోండి’ అని శాక్య అన్నారు. ఇండోరులో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మరో వ్యాఖ్య చేశారు. కొంతమంది మొక్కలు నాటుతారు కానీ నీళ్లు పోయరు అని శాక్య విమర్శించారు. శాక్య మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లోని ఉన్నారు. టికెట్లు అమ్ముడుపోయే నాయకులకు కాకుండా విధేయులైన వారికి ఇవ్వాలని ఎన్నికలకు ముందు శాక్య కోరారు. ఆ కారణంగానే గుణ శాసనసభ టికెట్‌ను జ్యోతిరాదిత్య మనుషులకు ఇవ్వకుండా శాక్యకు ఇచ్చారు.