Site icon vidhaatha

LK Advani | ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

LK Advani |బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(96) బుధవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ప్ర‌స్తుతం అద్వానీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన ఆరోగ్యంపై బీజేపీ సీనియర్‌ నేతలు, అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆయన కోలుకొని మళ్లీ ఇంటికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

భారతరత్న అందుకున్న సీనియర్‌ నేత

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన ఎల్‌కే అద్వానీకి మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాన్ని అద్వానీకి అంద‌జేశారు. అద్వానీ నవంబర్ 8, 1927న కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి త‌న రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1942లో సంఘ్‌, భారత రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. అద్వానీ 1986 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు.

1980లో బీజేపీని ప్రారంభించినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. అద్వానీ పార్లమెంటరీ జీవితం దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగింది. 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సేవలందించారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అద్వానీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పరిగణించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షాలు గెలిచాయి.

Exit mobile version